'దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు' - మేడిగడ్డ బరాజ్ వివాదం
🎬 Watch Now: Feature Video
Published : Nov 1, 2023, 9:36 PM IST
|Updated : Nov 1, 2023, 11:00 PM IST
Minister KTR fires on Rahul Gandhi : ఏదో జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని.. మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం వెళ్లి చూసి నేర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ కట్టారని.. దానివల్ల లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయన్నారు. దొరలకు, ప్రజలకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్, బీజేపీ దిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అని మంత్రి వ్యాఖ్యానించారు.
దిల్లీ దొరలతో కొట్లాడటం తెలంగాణకు కొత్తేమీ కాదన్నారు. తెలంగాణ తలవంచదని.. ఉగ్గు పాలతోనే ఉద్యమాలు నేర్చుకుంటారని కేటీఆర్ అన్నారు. నాలుగు కోట్ల ప్రజల పౌరుషానికి కేసీఆర్ ప్రతీక అని కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తల్లి సోనియా, నానమ్మ ఇందిరా గాంధీ, ముత్తాత నెహ్రూ తెలంగాణ బిడ్డల్ని పొట్టనబెట్టుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై మాట్లాడుతున్నారన్నారు. సీట్లు అమ్ముకునోళ్లను పక్కన కూర్చోబెట్టుకొని.. రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కూకట్పల్లి కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు బీఆర్ఎస్లో చేరారు.