Kaleshwaram Project Water Level : కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ.. 35 గేట్లు ఎత్తి నీటి విడుదల - Lakshmi Barrage 35 gates opened
🎬 Watch Now: Feature Video

Lakshmi Barrage gates opened : గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అంతగా వర్షాలు కురవలేదు. వానలు లేకపోయినా తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అయితే తాజాగా రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో వస్తున్న వరదతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది.
మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చి ఈ ప్రాజెక్టులో చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీకి భారీ ప్రవాహం వస్తోంది. ప్రాణహిత నుంచి 2,58,530 క్యూసెక్కుల మేర భారీ ప్రవాహం చేరుతోంది. బ్యారేజీలో 85 గేట్లకు గానూ 35 గేట్లు ఎత్తి 2,85,340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 9.8, అన్నారం బ్యారేజీలో 8 టీఎంసీల నీటి నిల్వ క్రమంగా కొనసాగుతోంది. కాళేశ్వరంలోని త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ల వరకు ప్రవహం చేరింది. పుష్కర ఘాట్లపై నుంచి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 8.250 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది.