పెట్రోల్ బంకుల ముందు బారులు తీరిన జనం - హైదరాబాద్లోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ - no petrol in hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 6:20 PM IST
Heavy Traffic Jam in Hyderabad : హిట్ అండ్ రన్ కేసుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఫలితంగా నగరంలోని పలు బంకుల్లో పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల ముందు బారులు తీరారు. మీటర్ల మేర లైన్లు కట్టడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
నగరంలోని నారాయణగూడ, బషీర్బాగ్, హైదర్గూడ, లక్డీకపూల్, అబిడ్స్ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మెహదీపట్నం నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారులను నియంత్రిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారని, గంటలోపు యధావిధిగా పెట్రోల్ దొరుకుతుందని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.