Siddipet Rains Today : అంతిమయాత్రకు అష్టకష్టాలు.. వరద ఉద్ధృతిలోనే అంత్యక్రియలు
🎬 Watch Now: Feature Video
Funeral in Floods Siddipet : ఇటువైపు గ్రామం.. అటువైపు వైకుంఠధామం.. మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు. చిన్న అవసరం వచ్చినా.. ప్రాణాలు అరచేత పట్టుకుని వాగు దాటాల్సిందే. పల్లెల్లోనూ అభివృద్ధి పరుగులు పెడుతుందని రోజూ వింటున్నాం. కానీ చేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా అని అధికారులు ఆలోచించకపోవడంతో.. ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదరక ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామప్రజలు వరదనీటిలోనే అంతిమయాత్రకు కష్టాలు పడాల్సిన పరిస్థితి తలెత్తింది.
మంగళవారం రోజున బస్వరాజు బాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం వైకుంఠ ధామానికి తీసుకెళ్లేందుకు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది. గ్రామాన్ని అనుకొని ప్రవహిస్తున్న వాగుకు అవతలి వైపున వైకుంఠధామం నిర్మించారు. అక్కడకి వెళ్లింటే వాగు దాటాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత్యంతరం లేక ప్రాణాల అరిచేతుల పెట్టుకొని.. నడుము లోతు నీటిలో మృతదేహంతో వాగును దాటి అంతక్రియలు నిర్వహించారు. వాగు అవుతల వైకుంఠధామం ఉండడంతో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరిన నాయకులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.