Gutha Sukender Reddy Latest Comments : 'కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది' - ఖమ్మం కాంగ్రెస్ బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video
Gutha Sukender Reddy Comments On Congress : కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా ప్రవర్తిస్తుందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చెయ్యడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ వైఫల్యం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బాధ్యత మరచి విదేశాలకు పోయిన చరిత్ర కాంగ్రెస్ అగ్ర నాయకులదని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని గుత్తా ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప.. కాంగ్రెస్కు ప్రజాసంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని అన్నారు.
ఈ క్రమంలోనే ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతలు తోసుకోవడం, తన్నుకోవడంతోనే వారి నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ పార్టీ ఎవరో అందరికీ తెలుసని.. ప్రతిపక్షాల ఐక్యత కాంగ్రెస్కు ఇష్టం ఉండదన్నారు. బీజేపీని గద్దె దించడం కూడా కాంగ్రెస్కు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్లో సమర్థ నాయకుడు అనే వారు లేనేలేరని ఎద్దేవా చేశారు. కుంభకోణాలు కాంగ్రెస్కు మాత్రమే అలవాటన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఢీకొట్టే ఏకైక నాయకుడు కేసీఆరే అని.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ తమతో కలిసి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.