Godavari Water Level Today : గోదావరికి జలకళ.. భద్రాచలం వద్ద 29 అడుగులకు చేరిన నీటిమట్టం - భద్రాచలంలో వర్షాలు
🎬 Watch Now: Feature Video
Godavari Water Level At Bhadrachalam : ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో.. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 14 అడుగులు ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. ఈరోజు ఉదయానికి 23 అడుగులకు పెరిగిన నీటిమట్టం.. ఉదయం 11 గంటలకు 29 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. అలాగే ఈరోజు రాత్రికి గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.
ఒకవైపు జోరువాన మరోవైపు గోదావరి పెరుగుతుండడంతో భద్రాచలం ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత ఏడాది వచ్చిన వరదలకు గోదావరి కరకట్ట చాలావరకు పాడైంది. కరకట్టకు అక్కడక్కడ రాళ్లు కూడా లేచిపోయాయి. గత ఏడాది 72 అడుగులు రావడంతో కరకట్ట చివరి భాగం వరకు గోదావరి నీటిమట్టం చేరి ప్రవహించింది. చాలావరకు కరకట్ట బలం తగ్గింది.. దీని పునరుద్ధరణ పనులు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ వరదలు వస్తే.. ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.