లగ్జరీ కారులో వచ్చి.. మేకను దొంగలించి.. నిమిషాల్లో జంప్! - మేక దొంగలించిన వీఐపీ
🎬 Watch Now: Feature Video
Goat Stolen Luxury Car : వీఐపీ నంబర్ ప్లేట్ ఉన్న ఓ లగ్జరీ కారులో వచ్చిన కొందరు దుండగులు.. అక్కడే ఉన్న మేకను ఎత్తుకుపోయారు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఇదే జరిగింది. మేక చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్డుపై ఓ లగ్జరీ కారు పార్క్ చేసి ఉండగా.. అక్కడకు కాస్త దూరంలో ఓ మేక తిరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మేక ఆ వాహనం సమీపంలోకి వెళ్లగా.. వెంటనే కారు డోర్ తెరుచుకుంది. మేకను కారులోకి లాగి.. దుండగులు డోర్ వేసేశారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే మేక యజమాని ఆరీఫ్.. స్థానిక గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
గురువారం కొందరు యువకులు కారులో వచ్చినట్లు మేక యజమాని ఆరీఫ్ తెలిపాడు. వాళ్లు కారు దిగి కాసేపు చుట్టూ చూస్తూ అక్కడే ఉన్నారని చెప్పాడు. ఆ తర్వాత వీధిలో ఉన్న తన మేకను దొంగిలించి కారులో వెళ్లిపోయారని వివరించాడు. ఈ ఘటనతో ఒక్కసారి షాక్ అయ్యి ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్నామని.. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.