Free Cancer Tests At Hyderabad : 'అభిమానులు, సినీ కార్మికుల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్స్'
🎬 Watch Now: Feature Video
Free Cancer Tests At Chiranjeevi Charitable Trust : రోజురోజుకూ పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి తన అభిమానులు, సినీ కార్మికులను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేశారు. స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. జులై 9 నుంచి నిరంతరంగా క్యాన్సర్ స్క్రీనింగ్స్ జరుగుతాయని చిరు తెలిపారు. జులై 9న హైదరాబాద్, జులై 16న వైజాగ్, జులై 23న కరీంనగర్‌లో రోజుకు 1000 మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా.. తానే భరిస్తానని తెలిపారు. స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ మన్నె గోపిచంద్, వైద్యులు సాయి, బిపిన్‌తో కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రణాళికను చిరంజీవి వెల్లడించారు. క్యాన్సర్ బారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అవగాహన కల్పించేలా సినీ పరిశ్రమ తరపున ప్రత్యేక లఘు చిత్రాలు రూపకల్పన చేయనున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి విజ్ఞప్తి మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్‌లో భాగంగా వచ్చే నాలుగు నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు డాక్టర్ మన్నె గోపీచంద్ తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సహృదయంతో ముందుకొచ్చిన చిరంజీవికి తోడుగా.. తమ వంతు సహకారాన్ని అందించనున్నట్లు డాక్టర్ గోపీచంద్ వివరించారు.