Fire Accident at play school in Manikonda : ప్లే స్కూల్లో మంటలు.. భయంతో చిన్నారుల పరుగులు - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Fire at Manikonda Jolly Kids Play School in Hyderabad : చిన్న పిల్లలు వేసవి సెలవులు అనంతరం పాఠశాలకి వెళ్లేందుకు.. అలవాటు పడుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. రోజూలానే స్కూల్‌కి ఉత్సాహంగా వెళ్లారు. విద్యార్థులు తరగతి గదిలో ఉంటుండగా.. కింద అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులందరూ భయాందోళనకు గురైయారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మణికొండ జాలీ కిడ్స్ ప్లే స్కూల్లోని మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై.. చిన్నారులను బయటకి పంపించారు. మరికొందరు చిన్నారులు బయటకు పరుగులు తీశారు. పాఠశాల సిబ్బంది అగ్నిమాపక శాఖకు మంటలు చెలరేగిన విషయం తెలియజేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలు పెద్దగా వ్యాపించకపోవడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కి వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. చిన్న చిన్న గదులు, సరైన వెంటిలేషన్ లేని ఇలాంటి స్కూళ్లలో ఫైర్ సేప్టీ ఏమాత్రం ఉండదన్న విషయం అందరికి తెలుసు. చిన్న సంఘటన కూడా పెను విపత్తుకు దారితీస్తుంది. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు.