బ్యాంకుల వేధింపుల వల్లే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు : ఫజల్ అలీ కుమార్తె
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 1:55 PM IST
Fazal Ali Daughter on Father Suicide : హైదరాబాద్ అమీర్‌పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) గన్‌మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే బ్యాంకుల రుణ వేధింపుల కారణంగానే ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలు బ్యాంకుల్లో తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించినా.. వడ్డీ రేట్లు ఎక్కువ వేసి ఆ మొత్తాన్నీ చెల్లించాలని ఒత్తిడి చేశారని ఆయన కుమార్తె సంబ్రిన్ తెలిపారు.
రికవరీ ఏజెంట్లు తరుచుగా ఫోన్స్ చేసి తనను వేధించినట్లు తండ్రి చెప్పారని సంబ్రిన్ పేర్కొన్నారు. నాన్న ఉదయం విధుల్లోకి వెళ్తున్నప్పుడు తనను కూడా రమ్మన్నారని చెప్పారు. తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులపై కొన్ని విషయాలు తనతో పంచుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడే వస్తా అని పక్కకి వెళ్లి ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న చనిపోవడానికి కారణమైన బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని సంబ్రిన్ కోరారు.