Pratidwani: మున్సిపాలిటీలు... అవిశ్వాసాల అలజడి - రాష్ట్రంలో పురపాలనపై చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2023, 10:19 PM IST

Pratidwani:రాష్ట్రంలో ఇప్పుడు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల ట్రెండ్ నడుస్తోంది. ఒకరిని చూసి ఒకరు కావొచ్చు.. ఛైర్మన్​పై ఆగ్రహం కావొచ్చు.. మాకెప్పుడు అవకాశం అన్న అధికారదాహం కావొచ్చు.. ఏదైమైనా ఇప్పుడు అధికారంలో ఉన్న సభ్యులే తమ ఛైర్మన్​పై అవిశ్వాస తీర్మానం బాణం ఎక్కుపెట్టారు. ఒకటి.. కాదు రెండు కాదు.. ఏకంగా 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస నోటీసులు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్పా తగ్గేలా లేదు. సభ్యుల నుంచి వచ్చిన ఈ వ్యతిరేకతను చూసి చాలామంది ఛైర్మన్లు.. అధిష్ఠానం తలుపుతడుతున్నారు. మరికొందరు న్యాయస్థానం తలుపులు తట్టి స్టే ఉత్తర్వులు పొంది తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతున్నారు. అసలీ వివాదానికి మూలబిందువు సరైన క్లారిటీ లేకపోవడమే. ఎన్నికైన అనంతరం మూడేళ్లకు బదులుగా నాలుగేళ్ల తరవాతే మున్సిపాలిటీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు వీలుగా గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గం సవరణ బిల్లును ఆమోదించింది. ఇది శాసనసభ, శాసన మండలిలోనూ ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదం పొందితే కానీ ఆ సవరణకు చట్టబద్ధత రాదు. గత సెప్టెంబరు నుంచి ఆ బిల్లు గవర్నర్‌ పరిశీలనలోనే ఉంది. ఈలోగా మూడేళ్ల గడువు ముగియటంతో అవిశ్వాసాలకు తెర లేచింది. అసలీ తలనొప్పిని ఎలా పోగొట్టుకోవాలని అటు మున్సిపల్ ఛైర్మన్లు, అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. నేతల కష్టాలు ఇలా ఉంటే.. అటు అధికారులకు కూడా 30 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అసలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల అలజడికి కారణాలు ఏమిటి?, ఈ వరస అవిశ్వాసాలకు వేరే కారణాలు, మూలాలు ఉన్నాయా?.. ప్రజాపాలన గాలికి వదిలేసి అధికార దాహం కోసం జరుగుతున్న ఈ పోరులో పురపాలికల్లో సౌకర్యాలు పడక వేస్తున్నాయా.?, ప్రస్తుతం పురపాలికలు, కార్పొరేషన్ల వాస్తవ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో పురపాలనపై చర్చ జరగాల్సిన అంశాలేంటి?. ఈ అంశాపపై ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ కార్యక్రమం చేపట్టింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.