భానుడి భగభగలు మొదలు.. మార్చి 15 తర్వాత పెరగనున్న ఉష్ణోగ్రతలు - Hail
🎬 Watch Now: Feature Video
Summer Effect in Hyderabad: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చుకుంటే ఎండలు తీవ్రంగా కనిపిస్తున్నాయని వాతవరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. మార్చి 15 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఏప్రిల్ తరువాత వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఆమె వివరించారు.
"తెలంగాణలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఎండ తీవ్రత పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మార్చి 15 తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ దాటాక వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం 37 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, పశ్చిమ తెలంగాణలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతల నమోదుకు ప్రస్తుతం 12 నుంచి 13 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. మిగతా జిల్లాల్లో వెదర్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ఉష్ణోగ్రతల నమోదు సమాచారం కచ్చితత్వంగా తెలసుకొనే అవకాశం ఉంటుంది. ప్రతి గంటకు వాతావరణ సమాచారం తెలుస్తుంది."- డా. నాగరత్న, హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు
పెరుగుతున్న ఉష్టోగ్రతలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వేసవి ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాత్రి సమయంలో మంచు కురిచి ఉదయాన్నే ఎండ తీవ్రంగా కాస్తోంది. దీంతో వాతవరణంలో కొన్ని మార్పులు జరిగి కొంత మందికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో ద్రవ పదార్థాలు తీసుకుంటే మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. తీసుకునే ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. మజ్జిగ, నిమ్మ జాతికి చెందిన రసాలు తీసుకోవాలి. బయట ఆహారం అసలు తీసుకోకపోవడం ఉత్తమం. పిల్లలు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బయట పనులు ఉంటే ఉదయం 11గంటల సమయానికి ముగించుకొని మధ్యాహ్నం సమయాన్న ఇంటి దగ్గరే ఉండేటట్లు జాగ్రత్త పడాలి.