Drone Camera flew over Yadadri temple : యాదాద్రి కొండపైన డ్రోన్ కెమెరా కలకలం - telangana latest news
🎬 Watch Now: Feature Video
Drone Camera flew over Yadadri temple : పర్యాటక అధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చెంత డ్రోన్ కెమెరాలతో ఇష్టానుసారంగా చిత్రీకరణలు కంగారు పుట్టిస్తున్నాయి. దృశ్యాలను యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆలయ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఒక వేళ తీయాల్సి వచ్చినా ఏమేం చిత్రీకరిస్తారో.. ఎక్కడెక్కడ షూట్ చేస్తారో ముందుగానే అనుమతి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా కొందరు ఇష్టారీతిన డ్రోన్లు వినియోగిస్తూ భద్రతకు ఆటంకం కలిగిస్తున్నారు.
తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరవేయడం కలకలం సృష్టించింది. గమనించిన ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎల్లపు నాగేంద్రబాబు, ఎల్లపు నాగరాజు అనే ఇద్దరు యూట్యూబర్స్.. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకుని కొండ దిగి పార్కింగ్ స్థలం నుంచి డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఆలయ పరిసరాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది... ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను స్థానిక పోలీసులకు అప్పగించారు.