CPI Fires on CM KCR : 'వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు.. మా సత్తా ఏంటో చూపిస్తాం' - తెలంగాణ తాజా రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 24, 2023, 3:04 PM IST
CPI Fires on CM KCR : బీఆర్ఎస్ చేసిన తప్పుతో కుమిలిపోమని...తమ సత్తా చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఉమ్మడి పది జిల్లాల్లోని 30 సీట్లలో తమ పార్టీకి పదివేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని వెల్లడించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. సెప్టెంబర్ 17ను బంగారు అక్షరాలతో చరిత్రలో లిఖించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పారన్నారు. దీనిపై కేసీఆర్ తన విధానం స్పష్టం చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్‌లో బస్సు యాత్ర చేస్తూ భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమంలో దొంగ ప్రమాణాలు చేశారని చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. అమరులకు కేసీఆర్ చేసిన వాగ్దానాలు మర్చిపోయారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారని చాడ విమర్శించారు. కేశవరావు రాజ్యసభకు వెళ్లింది కూడా లెఫ్ట్ పార్టీ ఓట్లతోనేనని విమర్శించారు.