Construction of Government School under Lakshven Foundation : ముత్తారంలో లక్ష్వెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం.. ప్రారంభించిన కలెక్టర్ - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 5:54 PM IST
Construction of Government School under Lakshven Foundation : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని హనుమకొండ జిల్లా (Hanumakonda District) కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Collector Sikta Patnaik) కోరారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో లక్ష్వెన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చాడ రమేశ్ రెడ్డి నిర్మించిన నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.53 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన లక్ష్వెన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సభ్యులను అభినందించారు.
ముత్తారం గ్రామంలో లక్ష్వెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాల భవన నిర్మాణం ఉందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో పాఠశాలను, డిజిటల్ తరగతి గదులతో నిర్మించడం హర్షనీయమన్నారు. గ్రామాల నుంచి వెళ్లి ఇతర ప్రాంతాలు, వివిధ దేశాల్లో స్థిరపడ్డ దాతలు, ఎన్నారైలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకోవాలని కోరారు. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో లక్ష్వెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ చాడ రమేష్ రెడ్డి తెలిపారు.