singareni coal production suspended : భారీ వర్షాలు.. ఆగిన పనులు.. సింగరేణికి కోట్లల్లో నష్టం - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
coal production halted in singareni : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అయినా వర్షాలు అంచనాల మేరకు కురవపోయినా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు మాత్రం జలకళను సంతరించుకున్నాయి. అయితే వర్షాల కోసం మాత్రం రైతులు దాదాపు రెండు నెలలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కర్షకులను వరణుడు కరుణించాడు. గత మూడ్రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సింగరేణి ఏరియాలోని రెండు ఉపరితల గనుల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో.. ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీంతో అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనులు బురదమయంగా మారడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. డంపర్లు, షవల్స్ ఆగిపోయి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కేటీకే ఉపరితల గని-2, కేటీకే ఉపరితల గని-3లలో మొత్తంగా 7025 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వర్షం కారణంగా సింగరేణి సంస్థకు దాదాపు రూ.1.72 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత వర్షం కారణంగా ఆగిపోయింది. గనిలో నిలిచిన వర్షపు నీటిని భారీ పంపుల ద్వారా బయటకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.