Bogatha Waterfall : పర్యాటకులకు అలర్ట్.. 'బొగత' సందర్శన నిలిపివేత - Bogatha Waterfall
🎬 Watch Now: Feature Video
Bogatha waterfall visit canceled : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో "తెలంగాణ నయాగారా" పిలిచుకునే బొగత జలపాతం 50 అడుగుల ఎత్తుతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండల పై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార పర్యాటకులకు కనులవిందు చేస్తోంది.
ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవి ప్రాంతంలో గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షానికి.. ములుగు అటవి ప్రాంతం కొండాకోనల నుంచి జాలువారిన వరదనీరు వాగులు వంకల గుండా ప్రవహిస్తూ బొగతలోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే బొగత వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం.. రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం డివిజన్ అటవీశాఖ అధికారులు బొగత జలపాతానికి వచ్చే సందర్శకుల రాకను నిలిపివేశారు.
మరోవైపు వెంకటాపురం మండలంలోని పాలెం వాగు మధ్యతరహా జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహానికి నాలుగు గేట్లు ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిపారుదలశాఖ అధికారులు విడుదల చేశారు.