Vijayashanthi fires on KCR : కాంగ్రెస్ నేతల విలీనానికే.. కేసీఆర్ వ్యూహం - Congress
🎬 Watch Now: Feature Video
Vijayashanthi fires on KCR : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతాయనే సంకేతాలు వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేతలను తమలో విలీనం చేసుకునే దిశగా వ్యూహాలు పన్నుతున్నాడని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ను హటావో.. బీజేపీకీ లావో అని పిలుపునిచ్చారు. మోడీ తొమ్మిది ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ అని.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా అమ్ముకుందో ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రేపై మండిపడ్డారు. అయనకు మతి భ్రమించినట్లుందన్నారు. విజయశాంతితో చర్చలంటూ లీకేజీలిస్తూ అవాస్తవాలు మాట్లాడటం పిచ్చి వాగుడు అవుతుందని అగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న మాణిక్‌రావు ఠాక్రే క్షమాపణ చెప్పడం కనీస బాధ్యతగా పేర్కొన్నారు. కేసీఆర్ వేడుకలపేరుతో ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నాడని విజయశాంతి దుయ్యబట్టారు.