200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి : పాయల్ శంకర్
Published : Dec 21, 2023, 4:00 PM IST
BJP MLA Payal Shankar on Power Supply : నేటి ఆధునిక కాలంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, పాలనను అందించేందుకు అప్పులు చేయాల్సిన అవసరం ఉందని, చేసిన అప్పులను సరైన విధంగా ఉపయోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వకుండానే అప్పులు చేసిందని మండిపడ్డారు. కరెంట్‌ను బీఆర్ఎస్ నేతలే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు విద్యుత్తేలేనట్లు చెప్పుకొస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధర్నాలు లేవని అందుకే 24 గంటల కరెంట్ ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు.
Telangana Assembly Sessions 2023 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎప్పటి నుంటి సరఫరా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 200 యూనిట్ల కరెంట్ కోసం విద్యుత్ సంస్థలకు రూ.8,820 కోట్లు కావాలని, ఈ డబ్బును ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ లిఫ్ట్ పథకాలే అయినందున విద్యుత్ మెరుగ్గా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కేంద్రం సాయంతోనే 24 గంటల కరెంట్ వచ్చిందని కేసీఆర్ అన్నారని కానీ కేంద్రం నుంచి సహాయం అందలేదని మాజీ మంత్రి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బీఆర్ఎస్ బద్నాం చేస్తోందని దుయ్యబట్టారు. శ్వేతపత్రంలో కేంద్రప్రభుత్వం చేసిన సహాయం ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.