Bandi Sanjay Fires on Telangana Government : 'తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా' - లోక్‌సభలో తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు
🎬 Watch Now: Feature Video

Bandi Sanjay Fires on Telangana Government : తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని.. లోక్‌సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. 9 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తులు భారీగా పెరిగి పోయాయని ఆరోపించారు. అవినీతి యూపీఏ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే భారత్ రాష్ట్ర సమితి పేరు.. భ్రష్టాచార్ రాక్షస సమితి అని బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో రైతుల ఆదాయం పెరగలేదు కానీ.. ముఖ్యమంత్రి కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని... ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని తెలిపారు. ఆ ధైర్యం బీఆర్ఎస్ నేతలకు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. జల్‌జీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చే నిధులను దోచుకున్నారని మండిపడ్డారు. గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద పేదలకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే.. లబ్ధిదారుల నుంచి అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేశారని ధ్వజమెత్తారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్లలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని బండి సంజయ్ ఆక్షేపించారు.