Bandi Sanjay Cycle Ride : సైకిలెక్కిన బండి.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు - Karimnagar MP Bandi Sanjay
🎬 Watch Now: Feature Video
Bandi Sanjay Cycle Ride in Karimnagar : కరీంనగర్లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ చిన్నపిల్లలతో సరదాగా ముచ్చటించారు. నిరంతరం సమావేశాలతో బిజీ బిజీగా ఉండే బండి సంజయ్ మానకొండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. కరీంనగర్ నాకా చౌరస్తా వద్ద చిన్నారులతో సరదాగా గడిపారు. సైకిల్ తొక్కుతున్న చిన్నారులతో చేయి కలుపుతూ సరదాగా మాట్లాడారు. అనంతరం బండి సంజయ్.. సైకిల్‌పై చిన్నపిల్లాడిని కూర్చోబెట్టుకొని తొక్కడంతో చిన్నారులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పిల్లలను పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాగా చదువుకుంటున్నారా? పాఠశాలలో సదుపాయాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. నిరంతరం భావోద్వేగాలతో ప్రసంగాలు చేసే బండి సంజయ్ సైకిల్ తొక్కుతూ సరదాగా కనిపించారు. అక్కడి వీధులలో తిరుగుతూ చుట్టుపక్కల స్థానికులతో ముచ్చటించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు బండి సంజయ్‌తో స్వీయచిత్రాలు దిగారు..