ఆటోడ్రైవర్‌కు గుండెపోటు.. సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన అంబులెన్స్ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
CPR saved Siddipet auto driver's life : జీవనశైలిలో మార్పుల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు సంభవిస్తోంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు గుండెపోటుతో అకాల మరణం చెందుతున్న వారెందరో. అప్పటిదాకా ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న వాళ్లు క్షణాల్లో కుప్పకూలి ప్రాణాలొదులుతున్నారు. అయితే ఇలా అకస్మాత్తుగా కుప్పకూలుతున్న వారిలో కొంతమందికి సీపీఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతున్నాయి. అందుకే ఇప్పుడు సీపీఆర్ సంజీవనిలా మారింది. మృత్యు అంచున ఉన్న వారిని మరణం నుంచి బయటకు తీసుకొస్తోంది.
తాజాగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరుపల్లి వద్ద ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఆటో పక్కకు ఆపి డ్రైవర్ పర్వతం రాజు కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పర్వతం రాజుకు సీపీఆర్ చేసి.. ఆటో డ్రైవర్ ప్రాణాలను నిలబెట్టారు. హుటాహుటిన రాజును గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన అంబులెన్స్ సిబ్బంది మహేందర్, రమేశ్‌ను వైద్యులు ప్రశంసించారు.
మరో ఘటనలో హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద కారు నడుపుతుండగా.. ఓ వ్యక్తి గుండె పోటుకు గురయ్యాడు. కారులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని గమనించిన సీఐ మోతీరాం కిందకు దించి సీపీఆర్ చేశాడు. స్పృహలోకి వచ్చిన అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది.