ఇంట్లో తండ్రి మృతదేహం.. 'పది' పరీక్షలకు హాజరైన విద్యార్థి
🎬 Watch Now: Feature Video
ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్ష అనేది తన జీవితంలో తొలి మెట్టులాంటిది. తాను వేసే తొలి అడుగే దాదాపుగా తన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే కీలకమైన ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అల్లారు ముద్దుగా పెంచి, తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన తండ్రి అకస్మాత్తుగా దూరమైతే ఆ బాధ అంతా ఇంతా కాదు. పరీక్ష కాదు కదా.. భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. చనిపోయిన తండ్రి మృతదేహం ఇంటి ముందు ఉండగా.. కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటున్న వేళ.. దు:ఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడో విద్యార్థి. నిర్మల్ జిల్లా కడెంనకు చెందిన రోహిత్.. పదో తరగతి చదువుతున్నాడు. ఇవాళ తొలి పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. తన తండ్రి వెంకట్ రాత్రి చనిపోయాడు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ విషాదాన్ని గుండెల్లో దాచుకుని పరీక్షా కేంద్రానికి వచ్చిన రోహిత్‌ను చూసి స్నేహితులే తల్లడిల్లారు.