Plants Cultivation: పర్యావరణంపై ప్రేమ.. ఇంటిని మొక్కలతో నింపేసిన దంపతులు - telangana latest news
🎬 Watch Now: Feature Video
A couple Plants Cultivation in Ghanpur: ఆ ఇంటికి వెళ్లగానే గుమ్మం దగ్గర ఓ కొబ్బరి చెట్టు.. తోరణంలాగ ఓ తీగ జాతి మొక్క ఆహ్వానం పలుకుతాయి. గడప దాటి లోపలికి వెళ్లగానే మనం ఏదో నందన వనానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఆ ఇంట్లో వాతావరణం ఎటు చూసినా పచ్చదనమే. కాసేపు ఉన్నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ ఇల్లు ఎక్కడంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలంలోని చెంచు వీధికి చెందిన గడ్డం చిన్న బాలనర్సు, సమ్మక్క దంపతుల నివాసం. వారు తమ ఇంటిని చిన్నపాటి వనంలా మార్చుకున్నారు. ఆ ఇల్లు విస్తీర్ణం 100 గజాలు ఉంటుంది. ఈ స్థలంలోనే వందలాది మొక్కలను పెంచుతున్నారు. దాదాపు 50 రకాల పైగా మొక్కలను ఆరేళ్లుగా సంరక్షిస్తున్నారు. 50 రకాల మొక్కల కోసం వారే స్వయంగా 50 కుండీలను చేసుకున్నారు.
వారు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వెళ్లిన ప్రదేశంలో ఏదైనా కొత్త రకం మొక్క కనిపిస్తే కొనుగోలు చేస్తారు. పర్యావరణంపై ప్రేమతో ఇంటిని మొక్కలతో నింపేశారు. వారిద్దరూ ఆ ఇంట్లో ఉండే చెట్లను చిన్నపిల్లల్లా చూసుకుంటున్నారు. కూరగాయలు, కలబందలతో సేంద్రీయ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల ఉన్నవారూ మొక్కలను పెంచుతున్నారు. ఆలోచనా, ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆ దంపతులు చెబుతున్నారు. వారి ఇంటికి ఎవరైనా వెళితే చిన్న స్థలంలో ఇన్ని మొక్కలా అని ఆశ్చర్యానికి లోనుకాక తప్పదు.