A Man Meets Parents After 20 years : చిన్నతనంలో తప్పిపోయి.. చివరికి 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు - Mancherial district latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2023/640-480-19129885-449-19129885-1690631728175.jpg)
20 years After Missing Man Meets Parents : చిన్నతనంలో తప్పిపోయిన ఓ బాలుడు 20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులను కలుసుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహేందర్ బింద్ ఐదోతరగతి చదువుతున్నప్పడు.. తల్లిదండ్రులతో కలిసి ముంబయిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ తప్పిపోయాడు. బాలుడు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కానీ మహేందర్ బింద్ ఆచూకీ లభించలేదు.
తల్లిదండ్రులకు దూరమైన ఆ బాలుడు.. 20 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడ్డాడు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్ యాదవ్ అనే వ్యక్తి.. బెల్లంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ముంబయికి వెళ్లిన శివకుమార్‌కు.. మహేందర్ బింద్ కలిశాడు. దీంతో అతన్ని కూడా తనతో పాటు బెల్లంపల్లికి తీసుకువచ్చాడు. ఇందులో భాగంగానే మహేందర్ బింద్.. తనది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజిపూర్ గ్రామం అని చిన్నతనంలో తప్పిపోయానని శివకుమార్‌కు తెలిపాడు. ఇదే విషయాన్ని శివకుమార్.. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు యువకుడి తల్లిదండ్రులు సంత్ర బింద్, మున్నా బింద్‌లకు ఈ విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే వారు గురువారం బెల్లంపల్లికి వచ్చి కుమారుడిని కలుసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మహేందర్ బింద్‌ను చూసి సంతోషంలో మునిగిపోయారు. అనంతరం అతడిని తీసుకొని స్వస్థలానికి బయలుదేరారు.