పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. ఈ చిరస్మరణీయ విజయాన్నందించిన విరాట్‌పై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలందుతున్నాయి. మున్ముందు మరిన్ని మ్యాచ్‌లు ఆడి గొప్పగా రాణించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉంటే, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. టీ20ల్లో నుంచి కోహ్లీ రిటైర్ కావాలని పేర్కొన్నాడు. ఎందుకంటే, కోహ్లీ తన పూర్తి శక్తిసామర్థ్యాలను పొట్టి క్రికెట్‌కు పరిమితం చేయకూడదంటూ పేర్కొన్నాడు. వన్డేల్లో కోహ్లీ ట్రిపుల్ సెంచరీ సాధించగలడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
ఆదివారం పాక్‌పై 82* పరుగులు కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమం అని షోయబ్ కొనియాడాడు. 'పాకిస్థాన్‌తో ఆడిన ఇన్నిగ్స్ విరాట్ కెరీర్‌లోనే అత్యుత్తమం. సాధించగలననే నమ్మకంతోనే ఆ ప్రదర్శన చేయగలిగాడు. అందుకే తన శక్తిసామర్థ్యాలను టీ20లకు పరిమితం చేయకుండా ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నా. ఈ నిబద్ధతతో కోహ్లీ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలడు' అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్తర్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కొంతకాలం పాటు ఫామ్ కోల్పోయిన కోహ్లీపై వచ్చిన విమర్శలపైనా షోయబ్ స్పందించాడు. 'అతను మూడేళ్లపాటు భారీ ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. కెప్టెన్సీని వదులుకున్నాడు. అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. కానీ కోహ్లీ మాత్రం ఎక్కడా సడలకుండా శిక్షణ తీసుకుంటూ.. దీపావళికి ముందురోజు చెలరేగాడు. బాణాసంచా లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. తన పునరాగమనానికి ఆ వేదిక, ప్రత్యర్థి సరైనవని భావించినట్లున్నాడు' అని పాక్ మాజీ పేసర్ పేర్కొన్నాడు. 'కింగ్ మళ్లీ వచ్చాడు. అతడి ప్రదర్శన ఎంతో ఆనందాన్నిచ్చింది. అతడో గొప్ప క్రికెటర్' అంటూ కొనియాడాడు.