సెమీ కర్లీ హెయిర్
సెమీ కర్లీ హెయిర్ ఉన్న వారు వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఒకవేళ మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి రెండుసార్లు చేసినా సరిపోతుంది. అయితే ఈ క్రమంలో నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల జుట్టు సహజమైన కర్లీనెస్‌ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ జరగదు.
కర్లీ హెయిర్..
కర్లీ హెయిర్.. ఇలాంటి జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయీ కోరుకుంటుంది. అందుకు కారణాలూ లేకపోలేదు.. కర్లీ హెయిర్ ఉంటే జుట్టు కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలాంటి కురులు అలల్లా ఎగురుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఉంగరాల జుట్టున్న వారికి ఎదురయ్యే సమస్యల్లా.. జుట్టు త్వరగా పొడిబారిపోవడమే. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. అలాగే కురులు తేమను కోల్పోకుండా పట్టులా ఉండాలంటే తలస్నానం చేసే గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలి.
పొడి జుట్టా..
పొడిబారిన జుట్టు ఉన్న వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి జుట్టున్న వారు తమ కేశాలకు రంగు వేసుకున్నా, హెయిర్ డ్రయర్స్ వాడినా జుట్టు గడ్డిలా మారడం, కుదుళ్లలో దురద, అలర్జీలు రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేనా.. జుట్టు చివర్లు చిట్లడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నిర్జీవమైపోవడం.. వంటి సమస్యలూ ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే సహజమైన షాంపూలను ఎంచుకోక తప్పదు. వీటిలో హానికారక రసాయనాలు ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ అయ్యే అవకాశమే ఉండదు. అలాగే పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం, ఈ క్రమంలో బాగా వేడిగా ఉండే నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లను ఎంచుకోవడం చేయాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కొంత వరకు ఫలితం ఉంటుంది.
ఆయిలీ హెయిర్..
కుదుళ్లలో ఉండే నూనె గ్రంథులు అధికంగా నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల కుదుళ్లు, జుట్టు జిడ్డుగా మారతాయి. ఫలితంగా చుండ్రు, దురద సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆయిలీ హెయిర్ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయక తప్పదు. అలాగే నూనె ఆధారిత షాంపూలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కండిషనర్‌ను కూడా జుట్టు చివర్లకు మాత్రమే రాసుకోవాలి. తద్వారా కుదుళ్లలో అధిక నూనె ఉత్పత్తి కాకుండా నియంత్రించవచ్చు.
గమనిక: జుట్టు తత్వాన్ని బట్టి ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? ఈ క్రమంలో ఎలాంటి షాంపూలు ఉపయోగించాలి? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాల గురించి తెలుసుకున్నారుగా! అయితే మీ జుట్టు సంరక్షణ విషయంలో ఇంకా మీకేమైనా సందేహాలు, సమస్యలుంటే సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.. అంతేకానీ సొంత వైద్యం చేసుకొని లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోకండి.