ప్రస్తుతం అంతా కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు గానీ మనల్ని హెపటైటిస్ వైరస్‌లు చాలాకాలంగానే పట్టి పీడిస్తున్నాయి. శరీరంలో అత్యంత కీలకమైన కాలేయాన్ని చుట్టుముడుతూ ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కాలేయం పనితీరు అస్తవ్యస్తమైతే శరీర వ్యవస్థ అంతా కుంటుపడినట్టే. విషతుల్యాలను నిర్వీర్యం చేయటం.. జీర్ణక్రియకు, జీవ ప్రక్రియలకు అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయటం.. ప్రొటీన్లను సంశ్లేషించటం వంటి కీలకమైన పనులు చేసేది కాలేయమే. అంతేనా? విటమిన్లు, గ్లూకోజు, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాటిని విడుదల చేస్తుంది. ఇది మహా మొండిది కూడా. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇంతటి మొండి అవయవాన్నీ హెపటైటిస్ వైరస్‌లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రాణాంతకంగానూ పరిణమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండగా.. 11 లక్షల మంది మృత్యువాత పడుతుండటమే దీనికి నిదర్శనం. దీన్ని నివారించుకునే, అదుపులో ఉంచుకునే మార్గాలున్నా ఎందుకీ దుస్థితి? హెపటైటిస్ మీద అవగాహన లేకపోవటమే. అందువల్ల దీని గురించి తెలుసుకొని ఉండటం అత్యవసరం.
హెపటైటిస్ అంటే?
- ఒక్కమాటలో చెప్పాలంటే కాలేయ వాపు. దీనికి మూలం హెపటైటిస్ వైరస్‌లు. వీటిల్లో ప్రధానంగా ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. వీటిల్లో అతి ప్రమాదకరమైనవి బి, సి వైరస్‌లు. ఎక్కువగా చూసేది హెపటైటిస్ బి, సి ఇన్‌ఫెక్షన్లే. హెపటైటిస్ ఎ, ఇ ప్రధానంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తాయి. వీటితో శరీరంలోకి ప్రవేశించి కాలేయ వాపునకు దారితీస్తాయి. హెపైటిస్ బి, సి మాదిరిగా ఇవేమీ దీర్ఘకాల కాలేయ జబ్బును కలగజేయవు. ప్రాణాంతకంగా మారటం అరుదు. మనం తరచూ చూసే కామెర్లు హెపటైటిస్ ఎ, ఇ వైరస్‌లతో వచ్చేవే. వీటితో తలెత్తే ఇన్‌ఫెక్షన్లు అంత ప్రమాదకరమైనవి కావు. చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి.
- హెపటైటిస్ ఎ బారినపడ్డవారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం.. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగని అందరిలో అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. పిల్లల్లో కన్నా పెద్దవారిలో లక్షణాలు ఎక్కువ. దీని బారినపడ్డ పిల్లల్లో కేవలం 10% మందిలోనే కామెర్లు తలెత్తుతుంటాయి. అదే పెద్దవారిలో 70% కన్నా ఎక్కువ మంది వీటి బారినపడుతుంటారు. కొందరిలో హెపటైటిస్ మళ్లీ తిరగబెట్టొచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, రక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్ ఎ ఇన్‌ఫెక్షన్ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ.
- హెపటైటిస్ ఇ వైరస్‌లో జీనోటైప్ 1, 2, 3, 4 అని నాలుగు ఉప రకాలున్నాయి. జీనోటైప్ 1, 2 మనుషుల్లోనే ఉంటాయి. 3, 4 జీనోటైప్ వైరస్‌లు పందులు, అడవి పందుల వంటి పలు జంతువుల్లో ఉంటాయి. ఇవి జంతువుల్లో ఎలాంటి జబ్బును కలగజేయవు గానీ అప్పుడప్పుడు మనుషులకు వ్యాపించొచ్చు. ఇన్‌ఫెక్షన్ గలవారి మలం ద్వారా హెపటైటిస్ ఇ వైరస్ బయటకు వస్తుంది. వీరి మలంతో కలుషితమైన నీటితో ఇతరుల ఒంట్లోకి ప్రవేశిస్తుంది. దీని బారినపడ్డవారిలో మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, దురద, దద్దు, కీళ్ల నొప్పులూ తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చ బడుతుంటాయి. మలం పాలిపోయినట్టుగా, తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్ ఇ ఇన్‌ఫెక్షన్ చాలావరకు 2-6 వారాల్లో దానంతటదే తగ్గిపోతుంది. అరుదుగా కొందరిలో తీవ్రంగా పరిణమించొచ్చు.
- హెపటైటిస్ డి వైరస్ ఒంటరిగా ఉండదు. హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలావరకు ఈ రెండు ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. హెపటైటిస్ బి గలవారిలో దాదాపు 5% మంది హెపటైటిస్ డి ఇన్‌ఫెక్షన్‌తోనూ బాధపడుతున్నారని అంచనా. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి మాదిరిగానే ఇదీ ఇన్‌ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు, ఒకరు వాడిని సూదులను మరొకరకు వాడటం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి, డి ఇన్‌ఫెక్షన్లు ఒకేసారి దాడిచేయటం వల్ల కాలేయ వాపు తలెత్తుతుంది. కానీ చాలామంది దీన్నుంచి పూర్తిగా కోలుకుంటారు. దీర్ఘకాల కాలేయ వాపునకు దారితీయటం అరుదనే చెప్పుకోవచ్చు. హెపటైటిస్ బి ఇన్‌ఫెక్షన్ గలవారికి దీని ముప్పు ఎక్కువ.
ప్రమాదకరం..
హెపటైటిస్ వైరస్‌లలో బి, సి చాలా ప్రమాదకరమైనవి. పైకేమీ తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించి, తిష్ఠ వేసుకుంటాయి. దీర్ఘకాలిక కాలేయ ఇన్‌ఫెక్షన్లుగా మారి వేధిస్తాయి. క్రమంగా కాలేయాన్ని దెబ్బతీస్తూ వస్తాయి. హెపటైటిస్ బి, సి సోకినా మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. ఇవి సంక్రమించినట్టయినా తెలియదు. దీంతో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మెత్తగా, మృదువుగా ఉండే కాలేయం గట్టిపడిపోయి, తాళ్లు తాళ్లుగా తయారవుతుంది. దీన్నే లివర్ సిరోసిస్ అంటారు. ఇలాంటి తీవ్ర దశలో రక్తస్రావం, కడుపు పెద్దగా ఉబ్బటం, కోమాలోకి వెళ్లటం, చివరకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలెన్నో తలెత్తే ప్రమాదముంది. కాబట్టి ముందు నుంచే హెపటైటిస్ బి, సి బారినపడకుండా కాపాడుకోవటం.. ఒకవేళ వీటి బారినపడితే తగు చికిత్స, జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
దీర్ఘకాల జబ్బుగా..
హెపటైటిస్ బి వైరస్ ఇన్‌ఫెక్షన్ చాలా త్వరగా కాలేయానికి చిక్కులు తెచ్చిపెడుతుంది. మనదేశంలో కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తున్న కారణాల్లో ముఖ్యమైంది ఇదే. హెపటైటిస్ బి వైరస్ రక్తం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. లాలాజలం, వీర్యం, యోని స్రావాల వంటి వాటితోనూ వ్యాపించొచ్చు. అప్పుడప్పుడే దీని బారినపడ్డవారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపించొచ్చు. హెచ్‌బీఎస్ ఏజీ పరీక్ష ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధరిస్తారు. ఇన్‌ఫెక్షన్ దశను తెలుసుకోవటానికి అవసరమైతే యాంటీ హెచ్‌బీసీ ఐజీఎం పరీక్ష చేయాల్సి ఉంటుంది. అక్యూట్ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోనే 99.5% మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య తగ్గుతుంది. దాదాపు 90% మందిలో వైరస్ కూడా దానంతటదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల (క్రానిక్) సమస్యగా మారొచ్చు. ఇన్‌ఫెక్షన్ ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్ హెపటైటిస్ బిగా భావిస్తారు. వైరస్ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదముంది. వైరస్ చురుకుగా ఉన్నప్పుడు యాంటీవైరల్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వైరస్‌ను అదుపులో ఉంచుతుంది. కాలేయం గట్టిపడటం, క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యల బారినపడకుండా కాపాడుతుంది.
మద్యం అలవాటుతో..
హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్ మొదలైతే త్వరగా పోయేది కాదు. చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గానే మారుతుంది. కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టి పడటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తటానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా. హెపటైటిస్ సితో హెపటైటిస్ బి కూడా ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి. హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. తొలిదశలో అంతగా లక్షణాలేవీ ఉండవు. హెపటైటిస్ బిలో మాదిరిగానే ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం వంటివి ఉండొచ్చు. యాంటీ హెచ్‌సీవీ పరీక్షతో వైరస్ సంక్రమించటాన్ని గుర్తిస్తారు. ఇది పాజిటివ్‌గా తేలితే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారిందేమో అనేది తెలుసుకోవటానికి హెచ్‌సీవీ రైబోన్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టయితే కాలేయ పనితీరు, వైరస్ ఉపరకాలను తెలిపే పరీక్షలు అవసరమవుతాయి. వైరస్ ఉపరకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
నివారణ ముఖ్యం..
- హెపటైటిస్ బి గలవారి రక్తం, శారీరక స్రావాల ద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశముంది. కాబట్టి అపరిచితులతో శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్లు, టూత్‌బ్రష్షుల వంటివి వాడుకోకూడదు. హెపటైటిస్ బి సంక్రమించకుండా టీకా అందుబాటులో ఉంది. దీని నివారణకు ఇదే అత్యుత్తమ మార్గం.
- హెపటైటిస్ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్తమార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల బ్లేడ్లు, బ్రష్షుల వటివి వాడుకోవద్దు. పచ్చబొట్లు పొడిచేందుకు, చెవులు, శరీర భాగాలు కుట్టేందుకు ఉపయోగించే సూదులు, పరికరాలు ఒకరికి వాడినవి మరొకరికి వాడకూడదు.
ఇవీ చదవండి: