షుగర్ ఉన్నవారికి చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల పండ్లూ తీసుకోవద్దు అంటారు. మరి ఏ పండ్లు తీసుకోవాలో చూద్దాం పదండి.. గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువగా ఉండే ఆపిల్, అవకాడొ, బెర్రీస్, చెర్రీస్, గ్రేప్‌ఫ్రూట్, ద్రాక్ష, కివీ, ఆరెంజ్, పియర్స్, ప్లమ్స్, పీచెస్, స్ట్రాబెర్రీస్... వంటివి తీసుకోవాలి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ఇక గ్లైసెమిక్ ఇండెక్స్ (56-69)మధ్యలో- అంటే, మీడియం స్థాయిలో ఉండే అంజీర్, కర్బూజ, పైనాపిల్, బొప్పాయి తగుపాళ్లలో తీసుకోవచ్చట. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ 70కి పైగా ఉండే ఖర్జూరం, పుచ్చకాయ... వంటివి తినకపోవడమే మంచిది అంటున్నారు. అంతేకాదు, చక్కెరవ్యాధి బాధితులు జ్యూస్, స్మూతీ... వంటివాటి జోలికి వెళ్లకుండా తాజా పండ్లను తీసుకోవడమే మేలు అంటున్నారు.
వ్యాక్సినేషన్ తీసుకుంటే..!
కరోనా వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా మొదలైంది. ముందు వరసలో వృద్ధులకీ మధ్యవయసువాళ్లకీ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకునే ముందూ తరవాతా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకునే ఉండాలి. ఆరు అడుగుల దూరాన్నీ పాటించాలి. అలర్జీలూ ఇతరత్రా మందులు వేసుకుంటున్నవాళ్లకయితే వైద్యుల సలహా తప్పనిసరి. మొదటి డోసు పడిపోగానే ఇక ఫరవాలేదు అనుకోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ లేకుండా తిరగకూడదు. గుంపులోకి వెళ్లకపోవడం, ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. టీకా తరవాత కొద్దిగా ఒళ్లు నొప్పులూ జ్వరమూ అలసటా వంటివి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి పోషకాహారం- అదీ ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది. ఇంజెక్షన్ ఇచ్చిన చోట తడి బట్టతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. ఆల్కహాల్, ధూమపానాలకు దూరంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. రెండు డోసులు పూర్తయ్యాక కూడా మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం మర్చిపోవద్దు. వ్యాక్సిన్ అనేది వైరస్‌తో పోరాడేందుకే కానీ అది సోకకుండా ఉండేందుకు కాదు. పైగా వైరస్ ఎప్పటికప్పుడు మారిపోతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.
కళ్లు పొడిబారితే...
స్మార్ట్‌ఫోన్లూ, కంప్యూటర్లూ, కాలుష్యం, ఏసీలూ... కారణమేదయినా ఈమధ్య చాలామందిలో కళ్లు పొడిబారడం అనేది రోజురోజుకీ పెరిగిపోతోంది. దీన్ని అలాగే వదిలేస్తే కంటిచూపుకే ప్రమాదం అంటున్నారు సౌతాంప్టన్ పరిశోధకులు. దీనివల్ల తరచూ కళ్లు ఎర్రగా కావడం, దురదపెట్టడం, చూపు మసకబారడం, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లుగా ఉండటం జరుగుతుంటుంది. ఇది 65 ఏళ్ల పైబడిన వాళ్లలోనే మరీ ఎక్కువట. తాత్కాలికంగా దీన్ని నివారించేందుకు లూబ్రికెంట్లూ టియర్ డ్రాప్సూ ఇస్తుంటారు వైద్యులు. కానీ చాలామంది అవి కూడా వాడకపోవడంతో వ్యాధి తీవ్రత పెరగడమే కాకుండా వాళ్ల రోజువారీ పనుల్లో కూడా ఇబ్బంది పడుతున్నట్లు పరిశీలకుల అధ్యయనంలో తేలిందట. అంతేకాదు, ఈ సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లలో డిప్రెషన్, ఆందోళనలు ఎక్కువగా ఉన్నట్లూ గుర్తించారట. కాబట్టి తొలిదశలోనే ఈ సమస్యను నివారించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
మగవాళ్లూ జాగ్రత్త!
కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో అయితే రెండో దశను దాటి మూడో విడతగా మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఆడవాళ్లకన్నా మగవాళ్లలోనే ఈ వైరస్ సమస్యాత్మకంగా ఉంది అంటున్నారు హూస్టన్ మెథడిస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. గతంలో వ్యాపించిన కేసుల్ని అధ్యయనం చేస్తే- ఆసుపత్రుల్లో చేరి, వెంటిలేటర్ల వరకూ వెళ్లినవాళ్లను గానీ, మరణించిన వాళ్లను గానీ లెక్కిస్తే అధిక శాతం మగవాళ్లే ఉన్నారట. అందులో కూడా ఊబకాయులే ఎక్కువ అని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చేసిన అధ్యయనాల్లో వెల్లడైందట. స్థూలకాయం తరవాత బీపీ, మధుమేహం, హృద్రోగాల సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఎక్కువగా ఆసుపత్రి పాలయినట్లు గుర్తించారు. ఈ సమస్యలన్నీ ఉండి కరోనా సోకిన వాళ్లలో ఎక్కువమంది మరణపుటంచుల వరకూ వెళ్లినట్లు తేలింది. దీన్నిబట్టి కరోనాకి మగవాళ్లూ అందులోనూ ఊబకాయులే ప్రధాన శత్రువులనీ కాబట్టి జాగ్రత్తపడమని హెచ్చరిస్తున్నారు సదరు పరిశీలకులు.