దాంపత్య జీవితంలో పిల్లలను కనాలని.. వారిని బాగా పెంచాలని అందరూ అనుకుంటారు. తల్లిదండ్రులు.. పిల్లల ఎదుగుదల మీద శ్రద్ధ పెడతారు. అందుకే వారి ఎదుగుదలకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం తమ పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరుగుతున్నారా? అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో తలెత్తుతుంటాయి. మరి ఈ విషయంలో స్పష్టత ఎలా తెచ్చుకోవాలో ఓ సారి చూద్దాం.
గర్భంలో పిండం ఏర్పడినప్పటి నుంచి ఎదుగుదల ప్రారంభం అవుతుంది. పుట్టిన తర్వాత ఎదుగుదల మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మొదటి వారం రోజుల్లో శిశువు తాను జన్మించే సమయంలో కోల్పోయిన బరువును తిరిగి పొందుతుంది. ఆ తర్వాత నుంచి వేగంగా బరువు, ఎత్తు పెరగడం ప్రారంభం అవుతుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు ఎత్తు, బరువు పెరుగుతుంటారు. అయితే ఈ ఎదుగుదల అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, ఆహారం వంటివి పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. పోషకాహారం అందించడం వల్ల పిల్లలు బాగా పెరుగుతారు. అలాగే ఇంట్లోనే మంచి ఆహారాన్ని పిల్లలకు తయారు చేసి పెట్టడం వల్ల వారి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఎదుగుతారు. అలాగే వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లోనే చేసి పెట్టేందుకు ప్రయత్నించాలి. మామూలుగానే ఎత్తు, బరువు కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు, బరువు పెరుగుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునే పద్ధతిని యాంత్రిపోమెట్రి అని అంటారు. పిల్లల ఎదుగుదలకు సంబంధించి ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఓ చార్ట్ విడుదల చేసింది. దాని ప్రకారం పిల్లలు ఎదుగుతున్నా లేదా అనేది చూసుకోవచ్చు. పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ వయసులో ఎంత ఎత్తు, బరువు ఉండాలనే వివరాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ చార్ట్ రూపంలో పొందుపరిచింది. దీని ప్రకారం పిల్లల వయసు, వారి ఎత్తు, బరువులను గణించి, దానిని శాతంగా పరిగణిస్తారు. 5 శాతం నుంచి 95 శాతం వరకు ఈ లెక్కలు ఉంటాయి. 60 శాతం పైబడితే పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉన్నట్లు అని పిడియాట్రిషియన్ డాక్టర్ నవీన్ చెబుతున్నారు.
ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ చార్ట్ ప్రకారం 50 శాతం వస్తే మంచి బరువు ఉన్నట్లని నిపుణులు చెబుతున్నారు. అలాగే 25 శాతం ఉంటే ఉండాల్సిన బరువు కన్నా తక్కువ ఉన్నట్లు అర్థమని అంటున్నారు.