సాధారణంగా చాలామంది డెలివరీ తర్వాత అది సిజేరియన్ లేదా సహజ ప్రసవమైనా చాలా నెలలపాటు వ్యాయామం జోలికి వెళ్లరు. దాంతో పెరిగిన బరువు అలాగే ఉండిపోతుంది. లేదా మరింత బరువు పెరిగే ఆస్కారమూ ఉంటుంది. అంతేకాదు.. వ్యాయామం చేయకపోవడం వల్ల పొట్ట కండరాలు ముందున్న స్థితికి రాకుండా అలానే వదులుగా ఉండిపోతాయి. మొదటి కాన్పు తరువాత వ్యాయామాలు చేయకపోవడం వల్ల పొట్ట కండరాలు బలహీనంగా మారతాయి. ఆ తరువాత కూడా అవి అలానే ఉండిపోయి రెండోసారి గర్భం దాల్చినప్పుడు వాటి సాగేగుణం పూర్తిగా పోతుంది. మీరెన్ని రకాలుగా వ్యాయామాలు చేసినా పొట్ట తగ్గడం లేదంటే అక్కడి కండరాలు పూర్తిగా సాగేగుణాన్ని కోల్పోయాయని అర్థం.
మీరేం చేస్తారంటే..
మరోసారి పొట్టకు సంబంధించిన అన్ని రకాల వ్యాయామాలనూ క్రమం తప్పకుండా 2-3 నెలలపాటు చేయండి. పారాస్పైనల్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్‌కు సంబంధించిన వ్యాయామాలు చేస్తే ఫలితం ఉండొచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడూ, ప్రసవమయ్యాక కూడా వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గకపోవడం అనే సమస్యే ఉండదు. ఈ సమయంలో ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన వ్యాయామాలను ప్రయత్నించినా ఈ ఇబ్బంది తలెత్తదు.అయినా తగ్గకపోతే అందుకు కండరాలు బిగుతుగా మారడం, చర్మం వదులుగా ఉండటం సమస్యకు కారణం కావొచ్చు. ఈ రెంటిలో ఏ సమస్య ఉన్నా ‘టమ్మీ టక్’ అనే శస్త్రచికిత్స లేదా అబ్డామినల్ ప్లాస్టీ చేయించుకోవాల్సి ఉంటుంది.