Weight Loss Habits : ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం, శారీరక శ్రమ లేని ఉద్యోగం వంటివి చాలా మందిలో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే అధిక బరువుతో బాధపడుతున్నవారు ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులంటున్నారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా ? అయితే డైలీ లైఫ్‌లో ఎటువంటి పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎక్కువ పోషకాలతో ఆకలి నియంత్రణ..
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నవారు, తగ్గడానికి ఆహారం మానేస్తుంటారు. ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఎక్కువగా ఉండి, తక్కువ క్యాలరీలు ఉండే బ్రోకలీ, కాలీఫ్లవర్, బీరకాయలు, క్యారెట్లు, పాలకూర, టమోటాలు, మునక్కాయలు, బొప్పాయి, వంటి వాటిని రోజు వారి ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఆకలిని నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయని అంటున్నారు.
పిండిపదార్థాలు అవసరం..
చాలామంది బరువు తగ్గాలనుకునే వారు స్లిమ్ అవ్వడానికి పిండి పదార్థాలని పూర్తిగా మానేయాలనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహే అని నిపుణులు అంటున్నారు. శరీరానికి శక్తి కావాలంటే.. పిండిపదార్థాలు చాలా అవసరమని చెబుతున్నారు. ఈ సూత్రం కొవ్వు పదార్థాల విషయంలోనూ వర్తిస్తుంది. జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు తప్పనిసరిగా అవసరమవుతాయి. కాకపోతే అవసరం అయిన మేరకు కొవ్వు పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి మేలు చేసే నట్స్, అవిసె గింజలు, నువ్వులు, ఆలివ్‌నూనె వంటి వాటిని తగిన మోతాదులో తీసుకోవాలని తెలియజేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఆయిల్ ఫుడ్, జంక్‌ఫుడ్ లేదా ప్యాకెట్ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలంటున్నారు. పొరపాటున వీటిని డైట్ సమయంలో తీసుకుంటే మీరు బరువు తగ్గాడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయిపోతాయని చెబుతున్నారు.
వాకింగ్, యోగా- వీటిలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్ ? నిపుణుల మాటేంటి!
గంట సమయం వ్యాయామం..
బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు తప్పకుండా గంటసేపయినా వ్యాయామం చేయాలని నిపుణులంటున్నారు. వీరికి ఎంత బీజీ లైఫ్ షెడ్యూల్ ఉన్నా సరే వాకింగ్, జాగింగ్ చేయడం మర్చిపోవద్దని అంటున్నారు. మీకు జిమ్‌లో కసరత్తులు చేయడం పట్ల ఆసక్తి ఉంటే ఇంకా త్వరగా స్లిమ్ అవుతారని చెబుతున్నారు. డైలీ కొంత శారీరక శ్రమ చేసి చెమట తీయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వులు కరుగుతాయని తెలియజేస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోవాలి..
మనలో చాలా మంది కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల తగవులు, పని ఒత్తిడి వంటి వాటి వల్ల ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటారు. అధిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కాబట్టి, మనసుకు నచ్చిన పనుల కోసం కొంత సమయం కేటాయించుకోండి. ఇంట్లోనే ధ్యానం చేయడం, తోటపని, పిల్లలతో సరదగా గడపడం చేయాలని సూచిస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ల విడుదలని తగ్గిస్తాయి. దీంతో బరువు అదుపులో ఉంటుంది.
సరైన నిద్రతోనే..
ఈ రోజుల్లో చాలా మంది ఆఫీస్ పనులు, చదువు ఇతర కారణాల వల్ల కంటినిండా నిద్ర పోవడం లేదు. కానీ.. దీర్ఘకాలికంగా ఇదే కొనసాగితే బరువు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి, కచ్చితంగా రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతుంది!
చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్ ప్యాక్స్‌తో కోమలంగా మారిపోతాయి!