High Court Dismisses Group1 Candidates Petition : గ్రూప్-1 నియామకాలపై ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్-1 జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్, రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే కోర్టును ఆశ్రయించడంలో సుదీర్ఘ జాప్యం జరిగిందని, దీనికి సరైన కారణాలు పేర్కొనకపోవడంతో ఇందులో జోక్యం చేసుకోలేమంటూ కొట్టివేసింది.
దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ 2018, 2019లో జారీ చేసిన జీవోలతోపాటు ఈ ఏడాది జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జి.రాధారాణిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అదేవిధంగా 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు పిలవాలని కోరారు. రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారిని మెరిట్ జాబితాల్లో చూపడం సరికాదన్నారు.
ఉదాహరణకు 208 జనరల్ కేటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో 10540 మందిని మెయిన్ కు ఎంపిక చేశారని, అదే విదంగా అన్ని కేటగిరీలకూ ఎంపిక చేయాలన్నారు. దానికి విరుద్ధంగా జాబితాను సిద్ధం చేశారన్నారు. అంతేగాకుండా 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని కోరారు. 2022 నోటిఫికేషన్లో 503 పోస్టులకు నోటిపికేషన్ వెలువడగా, ప్రస్తుతం 583 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిందన్నారు.
గతంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ అవకతవకలు జరిగాయన్న కారణంగా ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించగా, అనంతరం టీజీపీఎస్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించింద్రన్నారు. తరువాత సుప్రీం కోర్టులో అప్పీలును ఉపసంహరించుకుని తాజాగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందే నియామక ప్రక్రియకు సంబంధించి ఫిబ్రవరి 8న జీవో 29 జారీ చేసిందన్నారు. మొదట నోటిఫికేషన్ జారీ అయ్యాక నిబంధనలు మార్చరాదన్నారు.
అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు : ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలు సవరించడం వల్ల పిటిషనర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారికి మెరిట్ జాబితాల్లో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వుడు కేటగిరీలో పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం 2022లో జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో టీజీపీఎస్సీ తాజాగా ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.
దీనికి సంబందించి జులై 7న తుది కీ విడుదల చేసి మెరిట్ జాబితాను ప్రచురించిన తరువాత ఫిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. జీవో 29 ను అప్లోడ్ చేయకపోవడంతో కోర్టును సంప్రదించడంలో జాప్యం జరిగిందన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ అయిన తరువాత సమాచార హక్కు చట్టం కింద జీవో కాపీని పొందడానికి ప్రయత్నాలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది.
గత నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలంటూ గతంలోనే దాఖలైన పిటిషన్లను ఇదే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల ప్రిలిమ్స్‌ను రద్దుచేసి పాత నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాలన్న అభ్యర్ధనను అనుమతించలేమంటూ పిటిషన్లను కొట్టివేసింది. అయితే అందులో వెబ్‌నోట్, డీకోడింగ్ అంశాలను చర్చించలేదని, దీనిపై అభ్యంతరాలుంటే తదనంతర పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ పిటిషనర్లకు అవకాశం కల్పించింది.
గ్రూప్-2 పరీక్షలు యథాతథం - వాయిదాకు నిరాకరించిన హైకోర్టు
గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ - సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు