సీసా మూతలు తీస్తాం. కీబోర్డు మీద టైప్ చేస్తాం. స్టీరింగ్ తిప్పుతూ కారులో షికారు చేస్తాం. కూరగాయలు కోస్తాం. ఇలా చేతులు, వేళ్లతో రోజూ ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఒకేరకం కదలికలతో కూడిన ఇలాంటి పనులతో వేళ్లు అలసిపోవచ్చు, కీళ్లు బిగుసుకుపోవచ్చు. కండరాలు బలహీనపడి చేతి బిగువు తగ్గిపోవచ్చు. అయితే కొన్ని వ్యాయామాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు. వీటితో వేళ్ల కదలికలు మెరుగవుతాయి. నొప్పులూ తగ్గుముఖం పడతాయి. ఒకో వ్యాయామాన్ని రెండు చేతులతోనూ కనీసం నాలుగు సార్లు చేయాలి.
వేళ్ల సాగదీత
- అరచేయిని టేబుల్ మీద ఆనించాలి. చేతి మధ్యభాగం టేబుల్‌కు తాకకుండా కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
- నెమ్మదిగా వేళ్లను ముందుకు సాగదీయాలి.
- కాసేపు అలాగే ఉంచి, తిరిగి యథాస్థితికి రావాలి
పంజా బిగింపు
- అరచేయిని మీవైపు తిప్పుకోవాలి.
- పంజా మాదిరిగా.. మొదళ్లను తాకేలా అన్ని వేళ్లనూ వంచాలి.
- కొద్ది సెకండ్ల పాటు అలా పట్టి ఉంచి, వేళ్లను వదులుగా చేయాలి.
వేళ్లెత్తండి..
- అరచేతి పూర్తిగా ఆనేలా టేబుల్ మీద ఉంచాలి.
- వరుసగా ఒకో వేలిని పైకి లేపి, కిందికి తేవాలి.
- అన్ని వేళ్లనూ ఒకేసారి పైకి లేపొచ్చు కూడా.
- ఇలా ఒకో చేయితో 8-12 సార్లు చేయాలి.
పిడికిలి బిగింపు
- మిగతా వేళ్ల మీదుగా బొటనవేలును పోనిస్తూ పిడికిలి బిగించండి.
- పిడికిలిని కాసేపు అలాగే గట్టిగా పట్టి ఉంచండి.
- తర్వాత వేళ్లను వీలైనంత వెడల్పుగా సాగదీయండి.
పట్టు బలోపేతం
- సాఫ్ట్ బాల్‌ను అరచేతిలో పట్టుకొని, వీలైనంతవరకూ గట్టిగా నొక్కాలి.
- కొద్దిసేపు గట్టిగా పట్టుకొని వదిలేయాలి.
- ఒకో చేయితో 10-15 సార్ల చొప్పున వారానికి 2-3 సార్లు చేయాలి. బొటనవేలి కీలు దెబ్బతింటే మాత్రం చేయకూడదు.
బొటనవేలి సాగదీత
- అరచేయిని టేబుల్ మీద ఆనించి, వేళ్ల మొదళ్ల వద్ద రబ్బరు బ్యాండును చుట్టుకోవాలి.
- నెమ్మదిగా బొటనవేలిని మిగతా వేళ్ల నుంచి దూరంగా జరపాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తిరిగి యథాస్థితికి తేవాలి.
- ఇలా 10-15 సార్ల చొప్పున వారానికి 2-3 సార్లు చేయాలి. ఒకరోజు దీన్ని చేశాక మధ్యలో 48 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
బంకమట్టి ఆట
బంకమట్టి లేదా క్లేతో ఆడుకోవటం కూడా వేళ్ల కదలికలు మెరుగుపడటానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది చేతులనూ బలోపేతం చేస్తుంది. పైగా వ్యాయామం చేస్తున్న భావన కూడా కలగదు. పిల్లల మాదిరిగానే ఆడుకోవటానికి ప్రయత్నించండి. మట్టిని పిసికి.. బంతుల మాదిరిగా ముద్దగా చేయండి. అరచేతులతో తాల్చుతూ పొడవుగా ‘పాములు’ సృష్టించండి. వేళ్లతో మట్టిని నెమ్మదిగా వత్తుతూ.. కళ్లు, ముక్కు వంటి భాగాలను తయారుచేయండి. ఇలా మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. అదే సమయంలో చేతుల పుష్టినీ పెంచుకోండి.
చిన్న చిట్కా
వేళ్లు, చేతులు నొప్పిగా, బిగుసుకుపోయినట్టుగా ఉంటే వ్యాయామం చేయటానికి ముందు చేతులకు కాపడటం పెట్టుకోవటం మంచిది. గోరువెచ్చటి నీటిలో చేతులను కాసేపు ముంచినా మేలే. మరింత వేడి కావాలనుకుంటే చేతులకు కొద్దిగా నూనె రాసి, రబ్బరు గ్లవుజులను ధరించి వేడి నీటిలో పెట్టొచ్చు. ఇలా చేయటం వల్ల కదలికలు మెరగవుతాయి.
ఇదీ చదవండి: ఈ చిట్కాలతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!