హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. దుమ్ము ధూళి కారణంగా స్వచ్ఛమైన ఎండతాకడంలేదు. ఫలితంగా డి విటమిన్ పూర్తిస్థాయిలో అందక రోగ నిరోధక శక్తి తగ్గేందుకు దారితీస్తోంది.
నగరంలో కొవిడ్ మహమ్మారి విజృంభించడం వెనుక ఈ లోపమూ ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో కొవిడ్‌తో చనిపోయిన వారి విషయంలో ఇతర రుగ్మతలకు తోడు విటమిన్ డి లోపం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
డి.. ఉంటే త్వరగా కోలుకుంటున్నారు
తగు మోతాదులో తీసుకుంటే మహమ్మారి ముప్పును చాలావరకు తప్పించుకొనే వీలుంటుంది. శరీరంలో డి-విటమిన్ ఎంత ఉండాలి..? ఎంత కొరత ఉందనే విషయాన్ని పరీక్షల ద్వారా గుర్తించి, వైద్యుల సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత స్థాయిలో తీసుకుంటే వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని, విటమిన్-డి సరిపడా ఉన్న వారు కొవిడ్-19 నుంచి త్వరగా కోలుకోగలరంటున్నారు.
ఓ అధ్యయనం ప్రకారం
మెట్రో నగరాల్లో విటమిన్-డి తక్కువగా ఉన్నవారు: 80 శాతం
విద్యార్థుల్లో ఈ లోపం మరింత ఎక్కువ.
ఎండ.. చేపలు..
నగరంలో ఎండ సమృద్ధిగా ఉంటున్నా మన శరీరంలో విటమిన్-డిని ఉత్పత్తి చేసే కిరణాలను దుమ్ము, ధూళి నిరోధిస్తున్నాయన్నది వైద్య నిపుణుల మాట. అల్ట్రా వయెలెట్ కిరణాలు తగినంత స్థాయిలో అందితేనే విటమిన్ డిని శరీరం ఉత్పత్తి చేసుకోగలదు.
ఎండ తగలకుండా కార్యాలయాలు, ఇళ్లకే పరిమితం కావడంతో నగరవాసుల్లో తగిన స్థాయిలో ఉత్పత్తి కావడం లేదని చెబుతున్నారు. ఎండతోపాటు చేపలు, లివర్‌లో డి-విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉండే పెద్ద చేపల్లో సమృద్ధిగా లభిస్తుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలకం
కరోనా ముప్పు తగ్గించడంలో విటమిన్-డి పాత్ర కీలకం. రోగ నిరోధకశక్తి పెంచేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యుడు ప్రకాశంగా ఉంటాడు. ఆ సమయంలో కిరణాలు తాకితేనే శరీరం డి-విటమిన్‌ను తయారు చేసుకోగలదు. ఏడాదిలో ఒక్కసారైనా పరీక్ష చేయించుకొని లోపముంటే తగిన ఔషధాలు వాడాలి.
- డాక్టర్ బి.సుజీత్‌కుమార్, జనరల్ సర్జన్, అపోలో ఆసుపత్రి
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్