Vertigo Problem Reasons : ఉదయం నిద్ర లేవగానే తాజా అనుభూతి కలగాలి. శరీరం తేలిగ్గా ఉండి, మెదడు చురుగ్గా పనిచేయాలి. అయితే.. కొంత మందికి ఎలాంటి తాజా అనుభూతి కలగకపోగా తల తిరిగుతున్నట్లుగా, బలహీనంగా, నీరసంగా అనిపిస్తుంది. ఉదయాన్నే ఇలాంటి లక్షణాలు కనిపించడం సహజం కాదు. దీని వెనుక కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. వీటిని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
కారణాలు ఇవే..
మన శరీరంలో కనిపించే ప్రతి సమస్య వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కొన్ని వ్యాధులకు మందులు వాడినప్పుడు సైడ్ ఎఫెక్టుగా తల తిరగవచ్చు. అలాగే కొన్ని రకాల మత్తు మందుల వల్లా ఈ సమస్య తలెత్తే ఛాన్సుంది. అందుకే మత్తు పదార్థాలు లేదా ఔషధాలు వాడుతున్న వారు వైద్యుల్ని సంప్రదించి.. తలనొప్పికి గల కారణాలను నిర్ధరించుకోవాలి. ఒకవేళ ఔషధాలే తలతిరగడానికి కారణం అయితే.. డాక్టర్లు వాటిని పరిశీలించి ఆ ఔషధాన్ని, దాని మోతాదును మారుస్తారు.
Vertigo Causes : శరీరానికి అవసరమైన స్థాయిలో ద్రవాలు తీసుకోకపోతే డీ హైడ్రేషన్‌కు గురవుతాం. అలాగే అధిక మోతాదులో ఆల్కహాల్ తాగడం, కెఫిన్ తీసుకునే వారిలోనూ ఈ సమస్య ఉంటుంది. నీరు తగిన స్థాయిలో అందుబాటులో లేకపోతే మెదడు, శరీరం సరిగ్గా పనిచేయలేవు. దాంతో తల తిరిగినట్లుగా, తాము నిలుచున్న ప్రదేశం తిరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని నివారించాలంటే తరచుగా నీరు తాగుతూ ఉండాలి.
Vertigo Symptoms : బాధితులు ఈ సమస్యను సరిగా వ్యక్తీకరించలేకపోవచ్చు. ఇలాంటి వారు పడిపోతున్నట్లుగా, తల తిరుగుతున్నట్లుగా, బయటి వస్తువులు తిరిగినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనినే వర్టిగో (తల తిరగడం) అంటారు. దీనికి అనేక కారణాలుంటాయి. ఉదయాన్నే బీపీ స్థాయిల్లో హెచ్చు, తగ్గులు ఉన్నప్పుడు.. మైగ్రేన్‌తో బాధపడేవారికి ఈ సమస్య వచ్చే అవకాశముంది. గుండె మన శరీరానికి తగినంత రక్తాన్ని పంప్ చేయకపోవడమూ దీనికి కారణం కావచ్చు.
రక్తపోటు వల్ల, శరీరంలో నీరు తగ్గడానికి వాడే మందుల వల్ల కూడా వర్టిగో పెరగవచ్చు. స్లీప్ అప్నియా సమస్య ఉన్న వారు నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా తెల్లవారాక.. నిద్ర లేవగానే తల తిరిగే అవకాశముంది. గురక వస్తున్నా, బాగా నిద్రపోయిన తర్వాత కూడా.. తెల్లవారు జామున అలసటగా అనిపిస్తున్నా.. వైద్యుల్ని సంప్రదించడం మంచిది. బాధితుల ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటే కారణమేంటో కొంత వరకు అర్థమయ్యే అవకాశముంది.
Vertigo Disease Treatment : వర్టిగో బాధితుల్ని ఒకసారి నడిపించి చూడాలి. ఆ సమయంలో ఎక్కువగా తూలితే.. ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ చేయాలి. ఒక వేళ డాక్టర్‌కు చూపించకుండా.. అలక్ష్యం చేస్తే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పడిపోయినా ఉదయం నిద్ర లేవగానే తల తిరిగుతున్నట్లుగా అనిపిస్తుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. మన చెవిలోని లోపలి భాగం దెబ్బతిన్నా, అనారోగ్యానికి గురైనా మన శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది. ఈ విధంగా తల తిరిగే సమస్య రావచ్చు. కానీ.. చాలా వరకు ఇది దానంతట అదే తగ్గుతుంది. ఒక వేళ తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి.