అసిడిటీ అప్పటికప్పుడు ప్రాణాల మీదికి వచ్చే సమస్య కాదు. అలాగని తోసేసుకొనీ తిరగటమూ సాధ్యం కాదు. కూర్చుండనీయదు, పడుకోనీయదు. నిరంతరం ఛాతీలో ‘మండుతూనే’ ఉంటుంది. దీనికి మూలం జీర్ణాశయంతో అన్నవాహిక కలిసేచోట కండర వలయం (స్ఫింక్టర్) బిగువు తగ్గటం. సాధారణంగా తిన్న ఆహారం జీర్ణాశయంలోకి చేరుకునేటప్పుడు ఇది సడలుతుంది. ఆ వెంటనే గట్టిగా మూసుకుపోతుంది. ఇలా జీర్ణాశయంలోని ఆమ్లం, జీర్ణ రసాలు, ఆహారం వంటివి పైకి రాకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. దీని బిగువు తగ్గితే జీర్ణాశయంలోని ఆమ్లం పైకి ఎగదన్నుకొని అన్నవాహిక, గొంతులోకి వస్తుంది. దీన్నే గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ- గర్డ్) అంటారు. జీర్ణాశయంలో ఆమ్లాన్ని తట్టుకునే వ్యవస్థ ఉంటుంది. అందుకే లోపలి గోడలను ఏమీ చేయదు. అన్నవాహికలో ఇలాంటి రక్షణ ఏదీ ఉండదు. అందువల్ల ఆమ్లం పైకి ఎగదన్నుకొని వచ్చినప్పుడు మంట వంటి బాధలు మొదలవుతాయి. అన్నవాహిక లోపలి గోడలూ దెబ్బతింటాయి. పుండ్లు కూడా పడొచ్చు. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్లకూ దారితీయొచ్చు. కాబట్టి అసిడిటీని తక్కువగా చూడటానికి లేదు. కొందరిలో ఇది విడవకుండా, మందులకు లొంగకుండానూ వేధిస్తుంటుంది. ఇదే కొత్త చికిత్సల అవసరానికి దారితీస్తోంది.
మందులు, శస్త్రచికిత్సలున్నాయి గానీ..
అసిడిటీ తగ్గటానికి ఒమిప్రొజోల్ వంటి ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటార్ (పీపీఐ) రకం మందులు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎక్కువకాలం వాడితే దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. పేగుల్లో పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం తగ్గటం వల్ల విటమిన్ బి12 లోపం రావొచ్చు. ఎముకలు పెళుసుగా అవ్వచ్చు. కొందరికి డిమెన్షియా, జీర్ణకోశ క్యాన్సర్ ముప్పులూ పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరికి మందులు వాడుకుంటున్నా సమస్య పూర్తిగా తగ్గకపోవచ్చు. మధ్యమధ్యలో తిరగబెడుతుండొచ్చు. ఒక్కరోజు మందులు వేసుకోకపోయినా ఛాతీలో మంట, పులి తేన్పులు, కడుపుబ్బరం, తిన్న ఆహారం గొంతులోకి రావటం, గొంతులోనూ మంట, గొంతు బొంగురుపోవటం, కొద్దిగా తినగానే పొట్ట నిండిపోవటం వంటి ఇబ్బందులు ఎక్కువవుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఛాతీలో మంట దీర్ఘకాలిక సమస్యగా మారిందనటానికి సంకేతాలే. జీఈఆర్‌డీ బాధితుల్లో 25-30% మంది ఇలాంటి దశకు చేరుకుంటున్నవారే. మందులు వేసుకుంటున్నా వీరికి పెద్దగా ఉపశమనం ఉండదు. ఇలా దీర్ఘకాలంగా అసిడిటీతో బాధపడేవారికి ప్రస్తుతం ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే ‘ఫండోప్లికేషన్’ శస్త్రచికిత్స కూడా అందుబాటులో ఉంది. అయితే దీంతోనూ ఇతరత్రా శస్త్రచికిత్సల మాదిరిగానే సమస్యలు, ముప్పులు పొంచి ఉంటాయి. కొందరికి శస్త్రచికిత్స ఇష్టం లేకపోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎండోస్కోపీ సర్జరీలు పుట్టుకొస్తున్నాయి. ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సతో పోలిస్తే ఇవి చాలా తేలిక. నోటి నుంచి గొట్టాన్ని పంపించి, లోపల్నుంచే చికిత్స చేస్తారు. ఎలాంటి కోత లేకపోవటం వల్ల పైకేమీ తెలియదు. ల్యాప్రోస్కోపీ పద్ధతితో ముడిపడిన దుష్ప్రభావాలేవీ ఉండవు. పైగా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరముండదు. చాలావరకు అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని చికిత్సలు అరగంట, గంటలోనే పూర్తవుతాయి. వీటితో దాదాపు 60-70% మందికి పీపీఐ మందులు వేసుకోవాల్సిన అవసరం తప్పుతుండటం గమనార్హం.
అసిడిటీ-వినూత్న చికిత్సలు
ఎవరికి చేస్తారు?
ఎండోస్కోపిక్ పద్ధతులు అందరికీ చేసేవి కావు. పీపీఐ మందుల మీద ఆధారపడినవారికి, మందులు వేసుకుంటున్నా లక్షణాలు తగ్గనివారికి, దుష్ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ మందులు ఏమాత్రం ప్రభావం చూపనివారికి, జీర్ణాశయం పైభాగం కొద్దిగా ఛాతీ కుహరంలోకి చొచ్చుకొచ్చినవారికి (హయటస్ హెర్నియా), 24 గంటల పరీక్షలో పీహెచ్ 4 కన్నా తక్కువున్నవారికి ఇవి ఉపయోగపడతాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
- చికిత్సల తర్వాతా జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.
- మసాలాలు, కారం, నూనె పదార్థాలు, మిఠాయిలు, కొవ్వులు తగ్గించాలి.
- ఒకేసారి ఎక్కువెక్కువ కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి.
- తిన్న వెంటనే పడుకోవద్దు. కనీసం గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం కూడా చాలా చాలా ముఖ్యం.
నిశిత పరిశీలన తర్వాతే..
దీర్ఘకాల అసిడిటీ సమస్యలో అన్నింటికన్నా లక్షణాలే ముఖ్యం. కొందరికి ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని వస్తున్నా, లక్షణాలు వేధిస్తున్నా ఎండోస్కోప్ పరీక్షలో ఎలాంటి మార్పులు కనిపించవు. దీన్నే నాన్ ఎరోసివ్ రిఫ్లక్స్ డిసీజ్ (ఎన్‌ఈఆర్‌డీ) అంటారు. కొందరికి ఊపిరితిత్తులను కడుపును వేరుచేసే పొర (డయాఫ్రం) బలహీనంగా ఉన్నచోటు నుంచి జీర్ణాశయంలోని కొంత భాగం పైకి ఛాతీలోకి చొచ్చుకొని వస్తుంటుంది (హయటస్ హెర్నియా). ఇదీ అసిడిటీ లక్షణాలకు దారితీస్తుంది. కొందరికి ఆమ్లం ఉత్పత్తి అంతగా ఎక్కువగా ఏమీ ఉండదు. అయినా లక్షణాలన్నీ ఉంటాయి. దీన్ని రిఫ్లక్స్ హైపర్‌సెన్సిటివిటీ అంటారు. వీరికి జీర్ణాశయం, పేగుల కదలికలను మెరుగుపరచే డోమ్‌పెరిడోన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది.
కొందరికి ఇవేవీ లేకుండా కేవలం ఛాతీలో మంట మాత్రమే ఉండొచ్చు (ఫంక్షనల్ హార్ట్ బర్న్). దీనికి మూలం మానసిక భావన. వీరికి పీపీఐల అవసరమేమీ ఉండదు. మానసిక చికిత్స తీసుకుంటే సరిపోతుంది. అందుకే నిశితంగా పరిశీలించి, తగు పరీక్షలు చేశాకే ఎవరికి చికిత్స అవసరమన్నది నిర్ణయిస్తారు. ముందుగా ఎండోస్కోపీ పరీక్ష చేసి లోపల ఎలా ఉందన్నది చూస్తారు. అలాగే కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలిపే పీహెచ్/ఇంపీడెన్స్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో 24 గంటల సమయంలో ఆమ్లం ఉత్పత్తి తీరుతెన్నులు, ఇతర జీర్ణరసాల మోతాదులతో పాటు ఎలాంటి పదార్థాలు తిన్నప్పుడు ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది? ఎప్పుడు ఎగదన్నుకొని వస్తుంది? అనేవీ బయటపడతాయి. కండర వలయ సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి మ్యానోమెట్రీ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. ఇవి గర్డ్, ఎన్‌ఈఆర్‌డీ వంటి సమస్యలను గుర్తించటానికి, తీవ్రతను తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి.
ఎండోస్కోపిక్ చికిత్సలు రకరకాలు
ఎండోస్కోపిక్ పద్ధతుల మీద శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్త చికిత్సలను రూపొందిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇవి సరికొత్త రూపాల్లోకి అందుబాటులోకి వస్తుండటం విశేషం. వీటిల్లో ప్రస్తుతం రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
ఎండోస్కోపిక్ ప్లికేషన్ : ఎండోస్కోపిక్ పద్ధతుల్లో ఇది అత్యాధునికమైంది. ఇందులో ముందుగా మత్తుమందు ఇచ్చి, నోటి ద్వారా ఎండోస్కోప్‌ను లోపలికి పంపిస్తారు. తర్వాత ఒక సన్నటి తీగను, దాన్నుంచి గర్డ్‌ఎక్స్ అనే పరికరాన్ని జొప్పిస్తారు. మరో గొట్టం ద్వారా జీర్ణాశయం లోపలి భాగాన్ని చూస్తూ.. పరికరం చివరి భాగాన్ని పైకి వంచుతారు. దీనికి ఉండే కొక్కేల వంటి వాటి సాయంతో కండర వలయం దగ్గర జీర్ణాశయం గోడను కాస్త లోపలికి లాగి.. స్టేపుల్స్ బిగిస్తారు. ఇలా రెండు వైపులా కుట్లు వేస్తారు. దీంతో కండర వలయం బిగుతుగా అవుతుంది. ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటమే కాదు.. ఆమ్లం ఉత్పత్తీ 30-40% వరకు తగ్గుతుంది.
రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ : దీన్నే స్ట్రెటా పద్ధతీ అంటారు. కండర వలయం దగ్గర జీర్ణాశయం గోడ భాగాన్ని లేజర్ సాయంతో తక్కువ ఉష్ణోగ్రతలో లోపల్నుంచి కాల్చటం దీని ప్రత్యేకత. స్ట్రెటా పరికరం జనరేటర్‌తో కూడుకొని ఉంటుంది. దీని చివర ఉండే ఎలక్ట్రోడ్లను జిగురుపొరలోకి జొప్పించి, లేజర్ కాంతితో కాల్చేస్తారు. దీంతో కండర వలయం దగ్గరుండే కణజాలం క్రమంగా మందంగా తయారవుతుంది. బిగువు పెరిగి, ఆమ్లం పైకి రావటం తగ్గుతుంది.
ట్రాన్సోరల్ ఇన్‌సిషన్ లెస్ ఫండోప్లికేషన్ (టిఫ్) : ఇందులో ఎండోస్కోప్ ద్వారా ఈసోఫిక్స్ అనే పరికరాన్ని పంపించి.. జీర్ణాశయం పైభాగం గోడను లోపలికి లాగి, 270 డిగ్రీల కోణంలో తిప్పి కుట్లు వేస్తారు. క్రమంగా అది గట్టిపడి కండర వలయం బిగుతుగా అవుతుంది.
యాంటీ రిఫ్లక్స్ మ్యూకోజల్ అబ్లేషన్ (ఆర్మా) : ఏపీసీ (అర్గాన్ ప్లాస్మా కొయాగ్యులేషన్) పరికరం సాయంతో కండర వలయం చుట్టూరా ఉండే జిగురుపొరలో కొంత భాగాన్ని కాల్చేయటం దీనిలోని కీలకాంశం. కాలిపోయిన భాగం క్రమంగా గట్టిపడి, మందంగా అవుతుంది. దీంతో కండర వలయం బిగువుగా మారుతుంది. ఆర్మా పద్ధతిలో అన్నవాహకలోని మూడో పొర వరకూ చేరుకోవటం సాధ్యమవుతుంది. అంటే ఇది కాస్త లోపల్నుంచి జిగురుపొరను కాల్చేస్తుందన్నమాట. అందువల్ల ఫలితమూ మెరుగ్గా ఉంటుంది.
- ఇదీ చదవండి : ఈ విషయంలో కాలేయం పట్ల శ్రద్ధ తీసుకోండి