ఒకసారి చూపు పోతే తిరిగి రావటం అసాధ్యం. వృద్ధుల్లో రెటీనా మధ్య భాగం క్షీణించే సమస్య (మాక్యులార్ డీజెనరేషన్) సైతం నయమయ్యేది కాదు. ఇలాంటి అంధత్వ జబ్బులను నయం చేసే దిశగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (యూడబ్ల్యూ మెడిసిన్) పరిశోధకులు తొలి అడుగులు వేశారు. రెటీనా పనితీరును కణస్థాయిలో చూడటంలో విజయం సాధించారు.
మన కంట్లో కాంతిని గ్రహించే, కాంతికి అనుగుణంగా స్పందించే కణాలు (గ్రాహకాలు) ఉంటాయి. వీటిల్లో స్వల్ప స్థాయిలో తలెత్తే మార్పులను పసిగడితే కొత్త చికిత్సలకు మార్గం సుగమమైనట్టే. కాబట్టే పరిశోధకులు దీనిపై దృష్టి సారించారు. ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) ప్రక్రియను అధునాతనంగా తీర్చిదిది, కాంతి గ్రాహకాల పనితీరును విశ్లేషించారు.
సాధారణంగా రెటీనాలోని కోన్ కణాలు కాంతిని గ్రహించి, ఆ సమాచారాన్ని నాడులకు చేరవేస్తాయి. ఇవి తొలిసారి కాంతిని గ్రహించినప్పుడు నానోమీటర్ల స్థాయిలో మారిపోతున్నట్టు, తర్వాతే చూపు ప్రక్రియ ఆరంభమవుతున్నట్టు తేలింది. దీని ఆధారంగా కొత్త చికిత్సల రూపకల్పన వేగం పుంజుకోగలదని ఆశిస్తున్నారు.