మన ఒంట్లో నిరంతరం రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. వీటి మూలంగా కొన్ని వ్యర్థాలు, మలినాలు పుట్టుకొస్తుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోవటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేకపోతే ఇవన్నీ లోపలే పేరుకుపోయి విషతుల్యాలుగా మారిపోతాయి. ఇవే క్రమంగా జబ్బులుగా మారతాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, థైరాయిడ్ సమస్యల వంటి జీవనశైలి జబ్బులకు ఇదే మూలం.
విషతుల్యాలను బయటకు పంపిస్తే జబ్బులూ వాటంతటవే నయమవుతాయి. చెత్తను ఎప్పటికప్పుడు ఊడ్చేస్తుంటే ఇల్లు అందంగా కళకళలాడుతుంటుంది కదా. అలాగే మలినాలను, విషతుల్యాలను తొలగించుకుంటే శరీరమూ నిత్య ఆరోగ్యంతో తొణికిసలాడుతుంది. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆహార అలవాట్ల మార్పు గుణాత్మకమైన ఫలితాన్ని కనబరుస్తుంది. నిజానికి ఆహారమే ఔషధం. సరైన ఆహార పద్ధతులను పాటించినా చాలు. విషతుల్యాలు, మలినాలు పోగుపడకుండా చూసుకోవచ్చు. ఇలా శరీరాన్ని డీటాక్స్ చేయడానికిప్పుడు రామోజీ ఫిలింసిటీలోని సుఖీభవ వెల్ నెస్ సెంటర్ మనకందుబాటులో ఉంది.
"డీటాక్సిఫికేషన్ గురించి మామూలు పరిభాషలో చెప్పాలంటే... మనం ఇంట్లో జీవిస్తుంటాం కదా, ఆ ఇంటిని మనం రోజు శుభ్రం చేసుకుంటాం. అంతెందుకు మనం కంప్యూటర్ వాడతాం, మొబైల్ ఫోన్లు వాడతాం, వాటిని కూడా శుభ్రం చేసుకుంటాం. అలాగే మన శరీరం కూడా. శరీరాన్ని కూడా డీటాక్స్ చేయాలి. చాలా విషయాలు మన జీవనశైలితో ముడిపడి ఉంటాయి. మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ క్రమంలో మన శరీరంలో చాలా టాక్సిన్స్ పోగుపడిపోతాయి. మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న నీరు, మొక్కల ద్వారా శరీరాన్ని డీటాక్స్ చేయడానికి వాడతాం. ఉపవాసం కూడా ఒక డీటాక్స్ ప్రక్రియే.
అయిదు నుంచి వారం రోజుల పాటు విభిన్న ఉపవాస ప్రక్రియలను డీటాక్స్ చేయడానికి వాడతాం. అంతెందుకు జ్వరం కూడా శరీరాన్ని డీటాక్స్ చేసే ఓ విధానమే. ఒంట్లో రకరకాల టాక్సిన్స్ పోగుపడిపోతే, అది జ్వరం రూపంలో వ్యక్తమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది. అది కూడా ఒంట్లో టాక్సిన్స్ ఉన్నాయని చెప్పడానికే శరీరం వాడే ఓ విధానం. ఇలాంటి లక్షణాలను బట్టి శరీరానికి డీటాక్స్ అవసరమని చెబుతాం. వీటిని నీరు ద్వారా, కొన్ని సిట్రస్ జ్యూసెస్ ద్వారా కూడా డీటాక్స్ చేస్తాం. విటమిన్ సి పండ్లు డీటాక్స్ లో బాగా పని చేస్తాయి. శరీరానికి విశ్రాంతినివ్వడం, నీటి ద్వారా, పండ్ల జ్యూసెస్ ద్వారా డీటాక్స్ చేస్తాం. శరీరంలో మలినాలు పేరుకుపోతే అవి జబ్బుల ద్వారా బయటపడతాయని సైన్స్ మనకు చెబుతుంది. మన పొట్టను శుభ్రంగా ఉంచుకోగలిగితే దాదాపు ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. లేదంటే అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చిపడతాయి, ఇలా ఒంట్లో మలినాలను శుభ్రపరచుకోవడానికి ముందుగా ఆహారాన్ని ప్లాన్ చేయాలి.
డీటాక్సిఫికేషన్లో ప్రధాన పాత్ర ఆహారానిదే. డీటాక్స్ని శరీర పునర్నిర్మాణ ప్రక్రియగా చెప్పుకోవచ్చు. శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవడమే డీటాక్స్. ఒక గ్లాసు శుభ్రంగా లేకపోతే, అందులో ఎంత మంచి నీరు పోసినా లాభం లేదు. ముందుగా గ్లాసును శుభ్రం చేశాక మంచి నీరు పోయడంలో అర్థముంటుంది. అచ్చంగా ఇలాగే శరీరాన్ని కూడా శుభ్రం చేసి.. తర్వాత మంచి ఆహారాన్ని, జీవనశైలిని అలవర్చుకుంటే అది ఆరోగ్యాన్ని అందిస్తుంది."
- డాక్టర్ అర్చన, సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్
విషతుల్యాల నిర్మూలనకు సంప్రదాయ వైద్య చికిత్సలు ఆది నుంచీ ఎంతో ప్రాధాన్యమిచ్చాయి. మొక్క ఎండిపోతే ఆకులకు చికిత్స చేస్తే ఏం లాభం? వేళ్లు బాగుంటేనే కదా పోషకాలు బాగా లభిస్తాయి. మొక్క నిగనిగలాడుతుంది. శరీరం కూడా అంతే. దీనికి వేళ్లు మన జీవనశైలే. దీన్ని బాగుంచుకుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. ఉత్సాహంతో తొణికిసలాడుతుంది. మన శరీరానికి సమస్త శక్తిని సమకూర్చేది ఆహారమే. జీర్ణక్రియ సజావుగా సాగితే పోషకాలూ సరిగా అందుతాయి. మనసూ కుదురుగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లు కీలకం
అందుకే ఏం తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అనే వాటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి. ఇష్టం వచ్చినట్టు, ఏది పడితే అది తినటం సరికాదు. ఇది ఒక్క జీర్ణకోశాన్నే కాదు, అన్ని అవయవాల పనితీరునూ అస్తవ్యవస్తం చేస్తుంది. వేళాపాళా లేని, ఇష్టానుసార ఆహార అలవాట్లు విషతుల్యాలు పోగుపడటానికి దారితీస్తాయి. ఆహార పద్ధతులు, సమయాలను మార్చుకోవటం ద్వారా వీటిని తొలగించుకోవచ్ఛు విషతుల్యాల నిర్మూలనలో ఇదే ముఖ్యం. ముందుగా ద్రవాలతో ఆరంభించి.. క్రమంగా ఘనాహారం.. అదీ మితాహారానికి మారేలా చూడటం దీని ప్రత్యేకత.
"మనం తినే ఆహారం, చేసే వ్యాయామం, నిద్ర మొత్తంగా జీవనశైలి సరిగా ఉంటే మన శరీరం కూడా ఒంట్లో వ్యర్థాలను తొలగించుకుని జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే జీవనశైలి సమస్యలు చుట్టుముడితే మాత్రం డీటాక్స్ ప్రక్రియను ఆశ్రయించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అనారోగ్యం దరిచేరకుండా నివారణ కింద కూడా డీటాక్స్ ను ఆశ్రయించవచ్చు."
- డా. జేఎస్ శ్రీనివాసన్, సుఖీభవ వెల్నెస్ సెంటర్ మేనేజర్
పంచ భూతాల సమాహారమైన మన దేహాన్ని, వాటి సాయంతోనే మన ఒంట్లో ప్రాణ శక్తిని తిరిగి ఉత్తేజితం చేయడం, చక్కటి చికిత్సల సాయంతో శరీరంలోని మలినాలను తొలగించడం సుఖీభవ వెల్ నెస్ సెంటర్ కేంద్రం ప్రత్యేకత. మనల్ని వేధించే రకరకాల జబ్బుల పని పట్టడానికి ప్రత్యేక చికిత్సల్ని అందిస్తూ తనదైన విశిష్టతను చాటుకుంటోంది.
ఇదీ చదవండి- ఆరోగ్య సంజీవని.. సుఖీభవ వెల్నెస్ సెంటర్