శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే.. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవడమే కాదు.. ఏ పని పైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే ఇలాంటి మానసిక సమస్యను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితి (మెంటల్ బ్రేక్‌డౌన్)గా పరిణమిస్తుందని అంటున్నారు. దీనిని నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
![mentalbreakdownprecautions650-1.jpg](https://www.vasundhara.net/articleimages/mentalbreakdownprecautions650-1.jpg)
ఈ లక్షణాలున్నాయా?
మానసికంగా మనం ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడిని కొన్ని లక్షణాలతో గుర్తించచ్చని చెబుతున్నారు నిపుణులు.
- బీపీ పెరిగి విపరీతమైన కోపం రావడం
- మనపై మనం నమ్మకం కోల్పోవడం.. ఒక దశలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు రావడం
- ప్రతికూల ఆలోచనలతో రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం.. తద్వారా ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది.
- విపరీతమైన అలసట, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం
- ఏదైనా విషయం జరగకపోయినా జరుగుతుందేమోనని భ్రమపడడం
- ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడడం
- గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తుకు రావడం
- నలుగురిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడం.. ఎక్కువ సమయం ఒంటరిగానే గడపాలనిపించడం
- ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం
![mentalbreakdownprecautions650-2.jpg](https://www.vasundhara.net/articleimages/mentalbreakdownprecautions650-2.jpg)
దానికి కారణాలెన్నో!
ఇలా మనం మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులతో పాటు ఈ అంశాలు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
- నిరంతరాయంగా పనిలో కలిగే ఒత్తిడి ఇలాంటి మానసిక స్థితికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే కొంతమంది ఉద్యోగమైనా, ఇతర పనైనా తప్పక చేస్తుంటారు. అలాంటివారు అయిష్టంగానే ఆ పనిని పూర్తిచేస్తుంటారు. ఈ క్రమంలో రోజూ ఎదుర్కొనే ఒత్తిడి వల్ల కూడా ఈ స్థితి రావచ్చంటున్నారు నిపుణులు.
- బాగా ఇష్టమైన కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం/దూరమవడం, అలాగే ఆర్థిక స్థితి బాగోలేక పదే పదే డబ్బు గురించే మథన పడడం ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
- దీర్ఘకాలం పాటు నిద్ర సరిగ్గా లేకపోవడం, విశ్రాంతి తీసుకోవడానికీ సమయం దొరక్కపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. వంటివి కూడా మానసికంగా మనల్ని దెబ్బతీసేందుకు ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు.
![mentalbreakdownprecautions650-3.jpg](https://www.vasundhara.net/articleimages/mentalbreakdownprecautions650-3.jpg)
ఇలా జయించచ్చు!
ఇలా మీరు ఎదుర్కొంటోన్న ఈ తీవ్రమైన మానసిక స్థితిని గుర్తించిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..
- అన్నింటికంటే ముందుగా మీ ఫిజీషియన్ సలహా మేరకు కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాలి. తద్వారా మీ మానసిక స్థితి మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకోవచ్చు.
- ఇక ఈ మానసిక స్థితి నుంచి బయటపడేందుకు టాక్ థెరపీ/కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ.. వంటివి ఉపయోగపడతాయి.
- ఈ మానసిక స్థితి లక్షణాలను ఎదుర్కోవడానికి డాక్టర్ సలహా మేరకు యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ మందులు వాడచ్చు.
- అలాగే నిపుణుల సలహా ప్రకారం ఆక్యుపంక్చర్, యోగా, ధ్యానం, మసాజ్ చేయించుకోవడం.. చక్కటి ఫలితాన్నిస్తాయి.
- తీసుకునే ఆహారంలో కెఫీన్ లేకుండా చూసుకోవాలి.
ఇక వీటితో పాటు సుఖ నిద్ర, పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండడం, మనసుకు నచ్చిన పనులు చేయడంతో పాటు స్వీయ ప్రేమ అవసరమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ క్రమంలో సమస్యతో బాధపడుతోన్న వారికి కుటుంబ సభ్యుల నుంచి తగిన మద్దతు లభించడం ముఖ్యమే!
ఇదీ చదవండి: 25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి