ప్రస్తుతం వీధికో బ్యూటీ పార్లర్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని పార్లర్స్‌లో అందించే సేవలు బాగానే ఉన్నా, మరికొన్ని విషయ పరిజ్ఞానం లేని బ్యూటీషియన్లతో, స్టైలిస్టులతో, నాసిరకం సౌందర్య ఉత్పత్తులతో నెట్టుకొచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో పార్లర్‌కి వెళ్లినప్పుడు దానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి.
శుభ్రత ముఖ్యం!
పార్లర్‌కి వెళ్లగానే ముందు మనం గమనించాల్సిన విషయం అక్కడి శుభ్రత.. అక్కడ వాడే వస్తువులు, ఇతర సాధనాలన్నీ నీట్‌గా ఉన్నాయా? లేదా? గమనించండి. ఒకరికి వాడిన వస్తువులను ఇంకొకరికి వాడేముందు సరిగా శుభ్రపరుస్తున్నారా? లేదా పరిశీలిస్తే అక్కడి క్వాలిటీ మనకు అర్థమవుతుంది. శుభ్రపరచడం కూడా ఒక్కో వస్తువును ఒక్కో విధంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని వస్తువులను మరిగే నీటిలో ఉంచి స్టెరిలైజ్ చేయాలి. ఆ పద్ధతి ఫాలో అవుతున్నారా? లేదా? కనుక్కోండి. అలాగే అక్కడ ఉపయోగించే టవల్స్, ఫుట్ టబ్స్ వంటివి వాసన రాకుండా ఉండాలి. ఒకవేళ అవి దుర్వాసన వస్తుంటే పార్లర్ వాళ్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదని అర్థం.. అలాంటి పార్లర్‌ని ఎంచుకోకపోవడం మంచిది.
ఉత్పత్తుల నాణ్యతా ముఖ్యమే!
పార్లర్ అనగానే రకరకాల ట్రీట్‌మెంట్లు, ఫేషియల్స్, బ్లీచ్‌లు.. ఇలా వివిధ చికిత్సల నిమిత్తం అనేక సౌందర్య ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అవన్నీ మంచి కంపెనీలవేనా? కాదా? గమనించండి. పేరున్న కంపెనీల ఉత్పత్తులను వాడితే మంచిది. పార్లర్ రేంజ్‌ని బట్టి మరీ ఎక్కువ రేటున్న ఉత్పత్తులు కాకపోయినా.. ఉన్నంతలో నాణ్యమైన ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా? గమనించండి. వూరూ-పేరూ లేని, లేదా మీరెప్పుడూ వినని కంపెనీ పేర్లతో ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే అలాంటి పార్లర్లకు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే నాసిరకం ఉత్పత్తుల వల్ల చర్మానికి దీర్ఘకాలంలో హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మంచి నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులను వాడే పార్లర్స్‌కే వెళ్లడం అన్ని రకాలుగా శ్రేయస్కరం.
స్టైలిస్ట్ నేర్పరేనా?
పార్లర్‌లో బ్యూటీ ట్రీట్‌మెంట్స్ చేసే బ్యూటీషియన్ లేదా స్టైలిస్ట్‌కి అవి చేయడం వచ్చో, రాదో ముందు గమనించండి. ఎందుకంటే ట్రైనింగ్ లేని వ్యక్తులు చేస్తే మీ చర్మం పూర్తిగా పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మీరు వెళ్లే పార్లర్‌లో స్టైలిస్ట్‌లంతా శిక్షణ పొంది, అనుభవజ్ఞులై ఉండాలి. లేదంటే పార్లర్ చికిత్సల వల్ల చర్మానికి హాని జరిగే అవకాశం ఉంటుంది.
సలహా తీసుకోండి..
కొన్ని విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల చాలా లాభాలుంటాయి. ముఖ్యంగా మంచి బ్యూటీ పార్లర్, డాక్టర్, మంచి బొతిక్ వంటి వాటిల్లో ఇతరుల సలహాలను ఒకసారి పాటించి చూడచ్చు.. అలాగని వాళ్లకు నచ్చింది మీక్కూడా నచ్చాలని లేదు. అందుకే ఒకసారి వెళ్లి, వ్యక్తిగతంగా పరిశీలించి అక్కడి వాతావరణం మీక్కూడా నచ్చితేనే కంటిన్యూ అవండి.
సర్వీస్ బాగుందా?
కొన్ని పార్లర్స్‌లో మంచి ఉత్పత్తులనే వాడతారు. స్టైలిస్టులు కూడా అనుభవజ్ఞులై ఉంటారు. కానీ ఎక్కువ మంది కస్టమర్లు ఉండటం, పని ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మిమ్మల్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరేం కోరుకుంటున్నారో ఆ ఫలితం రాకపోయే అవకాశాలు ఎక్కువ.. ఉదాహరణకు హడావిడిగా చేసే హెయిర్ కట్‌కి, కాస్త సమయం తీసుకొని చేసే కటింగ్‌కి తేడా కనిపిస్తుంది. స్టైలింగ్ విషయంలోనూ అంతే.. అందుకే పార్లర్‌ని ఎంచుకునే ముందు అక్కడి సర్వీస్‌తో పాటు, స్టైలిస్టుల ప్రవర్తన కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది.
రేట్లు ఎలా ఉన్నాయి?
వీటన్నింటి తర్వాత పట్టించుకోవాల్సింది రేటు గురించి. వివిధ చికిత్సల నిమిత్తం మనకు వాడే ఉత్పత్తుల విలువను బట్టి పార్లర్ సేవల ధరను నిర్ణయిస్తారు. ఈ రెండిటినీ పోల్చి చూస్తే మీరు చెల్లించే మొత్తం సరైనదిగా అనిపిస్తోందా? లేదా? చూసుకోండి. పెద్ద పెద్ద పార్లర్లలో నాణ్యమైన ఉత్పత్తులు, వస్తువులు వాడతారు కాబట్టి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే నాసిరకం ఉత్పత్తులు వాడి, ఎక్కువ మొత్తం వసూలు చేసే పార్లర్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.
సంతృప్తి కలగాలి..
మొత్తం మీద పార్లర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత పెట్టిన డబ్బుకు సరైన సేవలనే పొందగలిగామన్న సంతృప్తి కలగాలి. అప్పుడే ఆ పార్లర్ మిమ్మల్ని మెప్పించగలిగిందన్నమాట.. ఒకవేళ ఇలాంటి సంతృప్తి లభించకపోతే మళ్లీ ఆ పార్లర్‌కి వెళ్లకపోవడం మంచిది.
కరోనా జాగ్రత్తలు కూడా!
అయితే పార్లర్ ఎంపికలో ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకోవడమూ ముఖ్యమే! ఈ క్రమంలో మీరు వెళ్లబోయే పార్లర్‌లో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారో, లేదో ముందుగానే తెలుసుకోండి. అలాగే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు వీలైతే స్లాట్ బుక్ చేసుకొని సమయానికి వెళ్లడం, అక్కడ ఉపయోగించే టవల్స్, ఫేషియల్ టూల్స్ మీరే తీసుకెళ్లడం, మాస్క్ ధరించడం.. వంటివి తప్పనిసరి! అలాకాదు.. సౌందర్య నిపుణుల్ని ఇంటికే పిలిపించుకోవాలనుకున్నా ఇంట్లోనూ ప్రత్యేకమైన గది కేటాయించుకొని కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఫేషియల్స్, హెయిర్ కటింగ్స్.. వంటివి చేయించుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఉపయోగించిన టూల్స్, టవల్స్ అన్నీ డిస్-ఇన్ఫెక్టంట్ ద్రావణంలో శుభ్రపరచడం, తలస్నానం చేయడం తప్పనిసరి!
ఇవీ చదవండి: