కొవిడ్-19 బారినపడ్డ చిన్నారుల్లో ఎక్కువ మంది స్వల్ప స్థాయిలోనే రోగ లక్షణాలను కలిగి ఉంటారని తాజా అధ్యయనం పేర్కొంది. కొందరికి మాత్రమే ఆసుపత్రిలో సంరక్షణ సేవలు అవసరమని తెలిపింది. కరోనా వైరస్ సోకిన రోగుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రతకు సంబంధించి భారీగా వివరాలు అవసరం. పెద్దలకు సంబంధించి డేటా గణనీయంగానే అందుబాటులో ఉంది. చిన్నారులకు సంబంధించిన వివరాలు పెద్దగా లభించడంలేదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. చైనా నుంచి సింగపూర్ వరకూ 1065 మందిపై నిర్వహించిన 18 అధ్యయనాలను విశ్లేషించారు. వీరిలో.. కరోనా వైరస్ సోకిన చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో వెల్లడైన వివరాల ప్రకారం..
- సరైన వైద్యంతో చిన్నారులు 1-2 వారాల్లోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు.
- ఈ పిల్లలకు జ్వరం, పొడి దగ్గు, అలసట ఉంది. కొందరికి ఈ లక్షణాలు కూడా లేవు. ఒక చిన్నారిలో మాత్రమే న్యుమోనియా, మూత్రపిండాల వైఫల్యం వంటి వాటితో ఆరోగ్యం విషమించింది. వైద్య పరిరక్షణతో అతడు కోలుకున్నాడు.
- ఈ కేసు మినహా ఎవరికి ఆక్సిజన్ లేదా వెంటిలేషన్ ఇవ్వాల్సిన అవసరం కలగలేదు.
- 10-19 ఏళ్ల వయసు వారిలో ఒక చిన్నారి మరణించాడు.
- కొవిడ్-19 సోకిన పిల్లల్లో ప్రధానంగా తలెత్తిన జీర్ణాశయ సమస్య.. వాంతులే.
- ఆ చిన్నారులు ఎక్కువగా తమ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 27లక్షలకు చేరువలో కరోనా కేసులు