ముందు చూస్తే కరోనా. వెనక చూస్తే క్యాన్సర్. క్యాన్సర్ బారినపడ్డవారి పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారితో పాటు క్యాన్సర్ బాధితులకూ కరోనా ముప్పు ఎక్కువగా ఉండటమే కాదు, తీవ్రతా అధికంగానే ఉంటోంది. కొత్త కరోనా జబ్బుతో సంభవిస్తున్న మరణాల్లో క్యాన్సర్ బాధితులూ పెద్ద సంఖ్యలో ఉంటుండటమే దీనికి నిదర్శనం. ఇటీవల అమెరికాలో నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని బయటపెట్టింది.
ఎందుకీ ముప్పు
సహజంగానే లింఫోమా, లుకీమియా వంటి కొన్ని క్యాన్సర్లలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ వంటి క్యాన్సర్ చికిత్సలతోనూ రోగనిరోధకశక్తి తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే, జబ్బును తట్టుకునే శక్తి క్షీణిస్తుంది. ఇదే క్యాన్సర్ బాధితులకు కరోనా ముప్పు పెరగటానికి దారితీస్తోంది.
తీవ్రతను బట్టి చికిత్స
కరోనా విజృంభణ మూలంగా దిగ్బంధం విధించటం, రవాణా సదుపాయాలు తగ్గిపోవటం వంటివన్నీ క్యాన్సర్ చికిత్సల మీదా ప్రభావం చూపుతున్నాయి. ఆసుపత్రుల్లోనూ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉంటోంది. అందుకే అత్యవసరమైతేనే చికిత్సలు, పరీక్షలు చేయటం అనివార్యమైంది. కాబట్టే క్యాన్సర్ నయమవుతుందా? కాదా? అనే దానికన్నా ప్రాణాలకు ప్రమాదం ఉందా అనేదే ప్రధానంగా మారింది. క్యాన్సర్ తీవ్రతను బట్టి చికిత్సలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చికిత్స చేయకపోతే 15 రోజుల్లో చనిపోయే అవకాశముందని అనిపిస్తే కరోనా జబ్బు ఉన్నా, లేకపోయినా వెంటనే చికిత్స చెయ్యాల్సిందే. మరో మార్గం లేదు.
ముప్పు ఎవరికి ఎక్కువ
- కీమోథెరపీ తీసుకుంటున్నవారికి, గత 3 నెలల కాలంలో కీమోథెరపీ తీసుకున్నవారికి
- రేడియోథెరపీ తీసుకుంటున్నవారికి
- గత 6 నెలల కాలంలో ఎముకమజ్జ, మూలకణ మార్పిడి చేయించుకున్నవారికి. రోగనిరోధకశక్తిని అణచిపెట్టి ఉంచే చికిత్స తీసుకుంటున్నవారికి
- రోగనిరోధకశక్తిని దెబ్బతీసే లుకీమియా, లింఫోమా లేదా మైలోమా లాంటి క్యాన్సర్లలో చికిత్స ఆరంభించకపోయినా ముప్పు పెరగొచ్చు
- క్యాన్సర్ చికిత్స పూర్తయినవారికి ప్రత్యేకించి కరోనా ముప్పు పెరిగే అవకాశమేదీ లేదు. ఇతరుల మాదిరిగానే ముప్పు పొంచి ఉంటుంది.
లక్షణాల్లో తేడాలూ ముఖ్యమే
ఒక్క కరోనాలోనే కాదు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లలోనూ జ్వరం రావొచ్ఛు వీటిల్లోనూ దగ్గు, ఆయాసం, వికారం, విరేచనాలు, ఆకలి మందగించటం వంటి కరోనా లక్షణాలే కనిపిస్తుండొచ్ఛు. కొందరిలో క్యాన్సర్ల మూలంగానూ ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుండొచ్ఛు అందువల్ల వీటి మధ్య తేడా తెలుసుకొని ఉండటం ముఖ్యం. పరీక్ష చేస్తే సమస్య బయటపడుతుంది. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లోనూ కరోనా మాదిరి మార్పులే కనిపిస్తాయి.
చికిత్సల్లోనూ మార్పులు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సల్లోనూ కొన్ని మార్పులు చేయటం తప్పనిసరైంది. ఇంజెక్షన్లకు బదులు కీమో మందును మాత్రల రూపంలో ఇవ్వటం, రేడియేషన్ వ్యవధిని కుదించటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవి కరోనా ముప్పు తగ్గటానికి ఎంతగానో తోడ్పడతాయి. రేడియేషన్ విషయంలోనూ 20 రోజుల పాటు ఇచ్చే చికిత్సను 10 రోజులకే కుదిస్తున్నారు. కీమోథెరపీ తీసుకునేవారికి తెల్లరక్తకణాలు పడిపోకుండా చూసే ఇంజెక్షన్లను గతంలో కొందరికే ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ ఇవ్వటం తప్పనిసరి చేశారు. అలాగే ఎర్రరక్తకణాలు పడిపోకుండానూ ఇంజెక్షన్లు విధిగా ఇస్తున్నారు.
అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో పోలిస్తే క్యాన్సర్ బాధితులకే కొవిడ్19 ముప్పు ఎక్కువ. కాబట్టి మామూలు వాళ్ల కన్నా ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
ఇదీ చూడండి: బీజకోశ క్యాన్సర్ – త్వరిత నిర్ధరణే సగం చికిత్స