Test for Diabetes: మధుమేహం, గుండెజబ్బు తీవ్ర సమస్యలు. ఇవి వచ్చే అవకాశాన్ని గుర్తిస్తే ముందే జాగ్రత్త పడొచ్చు. సాధారణంగా వీటి ముప్పును గుర్తించటానికి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి, రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ మోతాదులు, కొన్నిరకాల జన్యువులను పరిశీలిస్తుంటారు. అయితే వీటి కన్నా రక్తంలో 184 రకాల కొవ్వు అణువులు మరింత బాగా ఉపయోగపడే అవకాశముందని బయటపడింది. ఇవి లక్షణాలు కనిపించటానికి చాలా ఏళ్ల ముందుగానే ముప్పులను అంచనా వేయటానికి తోడ్పడుతుండటం గమనార్హం.
గతంలో పద్నాలుగేళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్నవారి రక్త నమూనాల విశ్లేషణ ఆధారంగా పరిశోధకులు దీన్ని గుర్తించారు. జన్యు సమాచారం కన్నా కొవ్వు అణువుల పరీక్షతోనే మరింత కచ్చితంగా మధుమేహం, గుండెజబ్బులను అంచనా వేసే అవకాశముంటున్నట్టు తేలింది. అయితే రక్తంలోని కొవ్వు అణువులు ఈ జబ్బులకు కారణం అవుతున్నాయా? లేకపోతే ఈ జబ్బులకు కారణమయ్యే జీవక్రియల మార్పులను కొవ్వు అణువులు సూచిస్తున్నాయా? అనేది తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. ఏదేమైనా కొవ్వు అణువులకూ మధుమేహం, గుండెజబ్బులకు సంబంధం ఉంటున్నమాట మాత్రం నిజం. అందుకే తాజా పరిశోధన ఫలితాల ఆధారంగా కొత్త ప్రయోగ పరీక్షను రూపొందించే దిశగా పరిశోధకులు దృష్టి సారించారు.
ఇదీ చదవండి: మహిళలు రోజూ డ్రైఫ్రూట్స్ తింటే ఆ సామర్థ్యం డబుల్!