కొవిడ్ మహమ్మారి టెలీమెడిసిన్ విస్తరణకు దారితీసింది. ఈ క్రమంలోనే రోగులకు దృశ్యమాధ్యమం ద్వారా వైద్య నిపుణుల సేవలు అందేలా స్మార్ట్ అద్దాలను (వుజిక్స్ ఎం400) అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ అధ్యాపకులు అభివృద్ధి చేశారు. వెబ్ కనెక్ట్ సౌకర్యం ఉన్న వీటిని చిన్న ఆస్పత్రుల్లో నైపుణ్యమున్న నర్సు లేదా ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఇస్తారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడికి డయల్ చేసి అనుసంధానం చేస్తారు. అద్దాలకే కెమెరా, మైక్రోఫోన్ జత చేసి ఉండటంతో వైద్యుడు రోగిని చూడవచ్చు. మాట్లాడవచ్చు. అవసరమైన సమాచారాన్ని ప్రదర్శించి చూపొచ్చు.
సాధారణంగా ఈ సౌకర్యం పొందాలంటే కంప్యూటర్లు, మానిటర్లు రోగి మంచం వరకు తీసుకెళ్లాలి. వీడియో కాన్ఫరెన్స్ పరికరాలూ ఉండాలి. ఈ పనులన్నీ స్మార్ట్ అద్దాలతో సులువుగా చేయొచ్చు. ఈ అద్దాల ద్వారా రోగికి అందిన సేవలను వైద్య రికార్డుల్లోనూ చేర్చొచ్చు. ప్రస్తుతం కెంటకీ రాష్ట్రంలోని ఐదు నర్సింగ్ హోంలు, ఒక అత్యవసర విభాగంలో ఈ అద్దాలు అందజేశారు. వీటి పనితీరు, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే మరిన్ని ఆస్పత్రులకు అందిస్తారు. కొవిడ్ ప్రభావం తగ్గాక స్మార్ట్ అద్దాలను వైద్య విద్యలో వినియోగించాలని యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా పంజా: 3 లక్షలకు చేరువలో మరణాలు!