Winter food :ఈ కాలంలో జీవక్రియలు నెమ్మదించడం వల్ల అదనపు కొవ్వులు, విషతుల్యాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా శరీరంలో పేరుకుపోతాయి. దీని ప్రభావం కాలేయంపై పడుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించి.. కాలేయాన్ని తిరిగి పునరుత్తేజితం చేయడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో ఉండే ఆల్కలీన్ సమ్మేళనాలే ఇందుకు కారణం. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించడంలో సహకరిస్తాయి. అలాగే చలిగాలులకు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.
చలికాలంలో పిల్లలు తరచూ జబ్బు పడుతుంటారు. ఇందుకు కారణం వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే! అందుకే రేగు పండును తరచూ వాళ్లకు అందించమంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ ‘సి’ ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. అలాగే వారిలో తలెత్తే మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. పెద్దవాళ్లలోనూ చలికాలంలో కీళ్లు పట్టేయడం వంటి సమస్యలొస్తాయి. వాటికి విరుగుడూ రేగు పండే. ఇందులో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము.. ఎముక బలాన్ని పెంచుతాయి.
చలికాలంలో ఎదురయ్యే అజీర్తి సమస్యలకు చింతపండును మించిన పరమౌషధం లేదంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. తద్వారా ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు.. అలాగే భవిష్యత్తులో ఆస్టియోపొరోసిస్ రాకుండా జాగ్రత్తపడచ్చు. ఇక చింతపండులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫినోల్స్ బరువును అదుపులో ఉంచుతాయి. పాలీఫినోలిక్ సమ్మేళనాలు పేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా రక్షిస్తాయి. ఇక చింతగింజల్ని పొడి చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగినా అరుగుదల మెరుగుపడుతుంది.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
చలికాలంలో విరివిగా లభించే ఉసిరిని నేరుగానైనా తీసుకోవచ్చు.. లేదంటే ఉసిరి రసం, చ్యవన్‌ప్రాశ్, పచ్చళ్ల రూపంలో కూడా తినచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. పుష్కలంగా ఉండే విటమిన్ ‘సి’ ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. అలాగే అజీర్తి కారణంగా తలెత్తే మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టచ్చు.
నువ్వుల్లో ఉండే అత్యవసర కొవ్వులు ఎముకలు, కీళ్లకు బలాన్నిస్తాయి. తద్వారా ఈ కాలంలో కీళ్ల నొప్పులు, ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు. దీన్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకొని తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం అందుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి, శరీరంలో రక్తహీనతను నివారించడానికి ఇది సూపర్‌ఫుడ్ అని చెప్పచ్చు.
ఇవి కూడా!
⚛ ఈ కాలంలో తలెత్తే జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి నెయ్యి కూడా మంచి ఆహారం. అయితే దీన్ని మితంగా.. అంటే రోజుకు ఒకట్రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవడం ఉత్తమం.
⚛ ఈ కాలంలో చిలగడదుంప/కందగడ్డలు కూడా విరివిగానే దొరుకుతాయి. ఇవి మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
⚛ ఖర్జూరాలను రోజూ తీసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. తద్వారా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ పీచు పదార్థం నిండి ఉన్న చిరుధాన్యాల్ని చలికాలంలో రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
ఇవీ చూడండి..
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ఈ టీలు తాగాల్సిందే
వింటర్ సూపర్ ఫుడ్.. మీ డైట్లో తప్పక ఉండాల్సిన డ్రైఫ్రూట్స్ ఇవే