Causes And Prevention Of Snoring : మనం నిద్రపోతున్నప్పుడు మన పక్కన ఉన్నవాళ్లు గురక పెడితే దానికి మించిన సమస్య మరొకటి ఉండదు. గురకల్లో విసుగు పుట్టించేవి కొన్నయితే.. మరికొన్ని గురకలు భయాన్ని పుట్టిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా అవసరమే. మరి అలాంటి అమూల్యమైన నిద్ర గురకతో పాడైతే అంతకుమించిన నరకం మరొకటి ఉండదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. గురకే కదా అని తేలిగ్గా తీసుకోకుండా ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో గురక ఒకటి. గురక వల్ల పక్కన ఉన్నవారికి కూడా నిద్రాభంగం అవుతుంది. గురక రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నోరు మూసుకొని గురక పెడుతుంటే నాలుకలో సమస్య ఉందని భావించాల్సి ఉంటుంది. నోరు తెరిచి గురక పెడుతుంటే మాత్రం గొంతులోని మృదువైన కణజాలాల్లో సమస్య ఏర్పడిందని గ్రహించాలి. ఇక, వెల్లకిలా పడుకొని గురక పెడితే మాత్రం ప్రధాన సమస్యగా భావించాల్సి ఉంటుంది. మనం నిద్రించే సమయంలో శ్వాసను గట్టిగా తీసుకుంటే అది క్రమేణా గురకకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఇవే కారణాలు..
Snoring Causes : నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం వల్ల సమస్య వస్తుంది. మనం తీసుకునే గాలి ఎక్కువవుతున్న కొద్దీ ఈ సౌండ్ క్రమంగా పెద్దది అవుతుంది. నిద్రించే సమయంలో ముక్కు, నోటి నుంచి గాలి ఫ్రీగా పోకపోవడం గురకకు ప్రధాన కారణం అవుతుందని చెప్పొచ్చు. కొన్ని రకాల అలర్జీలు, అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్లు, ముక్కు లోపలి భాగం వాచిపోవడం, శ్వాస మార్గానికి అడ్డుపడటం లాంటివి కూడా గురక సమస్యకు కారణం అవుతాయి.
"పూర్వం పెద్ద వయస్సు వారిలో గురక సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం వయస్సుతో సంబంధం లేకుడా ఇది చాలా మందికి వస్తోంది. పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. శారీరక శ్రమ చేయకపోవడం, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, మన చుట్టుపక్కల కాలుష్యం పెరిగిపోవడం మొదలైనవి.. పిల్లల్లో ఎడినాయిడ్ హైపర్ ట్రోపీ రావడానికి కారణం అవుతున్నాయి. ఈ సమస్యతో బాధపడే పిల్లలు రాత్రిపూట సరిగ్గా పడుకోరు. నోరు తెరిచి గాలి పీలుస్తుంటారు. అలాగే గురక పెడుతుంటారు. మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఊబకాయం వల్ల గురక సమస్య వస్తోంది. అదే వృద్ధుల్లో చూసుకుంటే.. శరీరంలోని ఇతర కండరాలు బలహీనపడినట్లే మెడ కండరాలు కూడా బలహీనంగా తయారవుతాయి. అందుకే వాళ్లు శ్వాస తీసుకున్నప్పుడు బాగా గురక వస్తుంది" అని ప్రముఖ ఈఎన్టీ వైద్యులు సి.ఆంజనేయులు చెప్పుకొచ్చారు.
గురక సమస్యను తరిమికొట్టాలంటే ముందు అది ఎందువల్ల వస్తుందో తెలుసుకోవాలని డాక్టర్ సి.ఆంజనేయులు అన్నారు. కారణం తెలుసుకుంటే గురకను సులువుగా నయం చేసుకోవచ్చని చెప్పారు. అధిక బరువు ఉండేవారు ముందు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. బరువు తగ్గించుకోవడం సహా సాధారణ ఎక్సర్సైజులు, అలాగే మెడకు సంబంధించిన ఎక్సర్సైజులు కూడా చేస్తే గురక పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి..
snoring remedies : ఊబకాయం, వయసు మీద పడటం, శ్వాసనాళ సమస్యలు, సైనస్ సమస్యలు, మద్యం సేవించడం, ధూమపానం.. ఇలా కారణాలు ఏవైనా మనలో అధిక శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకొని బాగా పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని ఉపయోగించడం వల్ల అది మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను ఫ్రీ చేసి గురకను నియంత్రిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు అర టీస్పూన్ యాలకుల పొడిని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల గురక అదుపులోకి వస్తుంది.
ఈ అలవాట్లను మానాల్సిందే..
snoring prevention : గోరు వెచ్చటి నీటిలో పసుపు వేసుకొని తాగడం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడి, గురక దరికి రాకుండా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. వెల్లుల్లి రసాన్ని కొద్దికొద్దిగా తీసుకోవడం వల్ల కూడా గురకను అదుపులో పెడుతుంది. అలర్జీతో బాధపడే వారిలో గురక తగ్గేందుకు ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు వెంటనే వాటిని మానేయాలని సూచిస్తున్నారు. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల పెద్దవారిలో గురక సమస్య చాలా మటుకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గురక సమస్య ఎంతకీ తగ్గకపోతే సెప్టోప్లాస్టీ, టర్బినోప్లాస్టీ, ఎడినాయిడ్ ఎక్టిమీ లాంటి సర్జరీల ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Snore Precaution : బరువును అదుపులో ఉంచుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా గురకను నియంత్రించవచ్చు. అయితే బరువు అధికంగా ఉంటేనే గురక వస్తుందని చెప్పలేం. బక్కపలచగా ఉన్నవారిలోనూ గురక సమస్య కనిపిస్తుంది. మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కూడా గురకకు ఒక కారణం కావచ్చు. అందువల్ల మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవడం ముఖ్యం. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూనే, శరీరంలో ఎప్పుడూ నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. దీని కోసం తగిన ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా ముక్కు, గొంతులోని ద్రవాలు చిక్కబడకుండా చూసుకోవచ్చు. తరచూ పిల్లోలు, పిల్లో కవర్లను మారుస్తూ ఉండాలి. అలాగే వీటి ద్వారా ఉత్పన్నమయ్యే అలర్జీలకు దూరంగా ఉండాలి. దీని వల్ల ఆ అలర్జీల వల్ల కలిగే గురకకూ దూరంగా ఉండవచ్చు.