అధిక కొవ్వులూ, చక్కెర పదార్థాలాంటి హానిక ఆహారాన్ని గర్భిణులు, బాలితంతలు తీసుకుంటే.. అలాంటి ఆహారంపైన ఆసక్తి కలిగేలా పిల్లల మెదడులో, రుచి బొడిపెల్లో మార్పులు వస్తాయంటున్నారు కార్నెల్ యూనివర్సిటీకి చెందిన ఆహార పరిశోధకులు. ఇది ప్రధానంగా పిల్లల్లో ఊబకాయానికి దారితీస్తుందనేది ఆ శాస్త్రవేత్తల మాట. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ మార్పుల్ని గమనించినట్లు వారు చెబుతున్నారు.
‘మార్పుని మేం ప్రధానంగా రుచి బొడిపెల్లో గమనించాం. కొవ్వులూ, అధిక చక్కెరలుండే ఆహారాన్ని తీసుకున్న తల్లీ బిడ్డల్నీ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్న వారితో పోల్చిచూస్తే మొదటివారిలో తీపి పదార్థాల్ని ఇష్టపడే రుచి బొడిపెలు ఎక్కువగా ఉంటున్నాయి’ అని చెబుతారు పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన రాబిన్ డ్యాండో. పిల్లల్లో ఈ మార్పులకు కారణాలు ప్రత్యేకించి తెలియకపోయినప్పటికీ, రుచి విషయంలో గర్భంలోనే శిశువుల జీవక్రియ పరంగా మార్పులు జరగొచ్చని చెబుతున్నారు.
మనుషుల్లో దాదాపు సగం కేసుల్లో ఊబకాయానికి కారణం పిల్లలు పెరిగే వాతావరణం, తల్లిదండ్రుల జన్యువులేనని ఇప్పటికే అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులూ, బాలింతలు తీసుకునే ఆహారం విషయంలో మరింత అవగాహన పెంచుకుని పిల్లల ఊబకాయాన్ని నివారించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందంటారు.