ఉప్పల్‌కు చెందిన రాజేశ్, ఐశ్వర్య దంపతులు. ఆమె స్నేహితులు బంజారాహిల్స్, మాదాపూర్‌లో సొంతింట్లో ఉంటున్నారు. ప్రతి విషయంలో వారితో పోల్చుకునేది. ఈ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలే. ఆమెను మనస్తత్వ నిపుణుడి వద్దకు తీసుకెళ్లగా.. అనుకరణతో వచ్చిన మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రతి వ్యక్తికి ఒక జీవన శైలి ఉంటుంది. ఎప్పుడైతే వేరొకరితో పోలిక మొదలవుతుందో.. ఆశలకు తగ్గట్టుగా జీవితం గడిపేందుకు వీల్లేక తెలియకుండా విపరీత మానసిక సమస్యలకు గురవుతుంటారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి అవసరాల దృష్ట్యా లోలోన మదనపడిపోతూ తీవ్ర నిరాశకు గురవ్వడం, మానసిక ఆందోళనకు లోనవడం జరుగుతున్నాయి. పోలికతో వచ్చే మానసిక సమస్యలు.. వాటిని అధిగమించేదెలా.. తదితర అంశాలను ప్రముఖ మనస్తత్వ విశ్లేషకులు ఎస్వీ నాగ్‌నాథ్ విశ్లేషిస్తున్నారు.
జీతం.. జీవితం.. సమతుల్యమేనా? అవసరానికి మించిన జీవన శైలి, మార్చుకునే తత్వానికి మధ్య, ఎగువ మధ్య తరగతికుటుంబాలే ఎక్కువగా గురవుతున్నారు. ఈ ప్రభావంతో అప్పుల్లోకి కూరుకుపోవడం, వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడుతూ అంతిమంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. జీవితం.. జీతం సమతుల్యం చేసుకుంటూ గమనం సాగాలి. జీతం వస్తుందన్న ఉద్దేశంతో ఒకటి మించి నివాసాలు సమకూర్చుకోవడం సరికాదు. కార్యాలయానికి వెళ్లాక పనితో పాటు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనే చర్చలు కొనసాగిస్తున్నారు. దంపతుల్లో ఎవరో ఒకరు ఆ ప్రభావానికి గురై కొత్తగా హంగూ ఆర్భాటాలు సమకూర్చుకోవాలన్న మోజులోకి వెళ్లిపోతున్నారు. దీన్ని ‘మోడలింగ్ పర్సనాలిటీ సమస్య’గా చెప్పవచ్చు.
వాస్తవిక జీవితాన్ని అర్థం చేసుకుంటే.. ఈ తరహా అనుకరణ సమస్యతో బాధపడే వారు కుటుంబంపై ఎక్కువగా శ్రద్ధ చూపలేరు. పిల్లలను సరిగా పెంచలేరు. అభిప్రాయ భేదాలు తలెత్తి సత్సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వీటి నుంచి బయటపడేందుకు కొన్ని సందర్భాల్లో వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ఈ మానసిక సమస్యను అధిగమించాలంటే వాస్తవికతతో కూడిన జీవితాన్ని గడిపే తత్వం అలవరుచుకోవాలి. అపజయాల నుంచి నేర్చుకునే గుణం ఉండాలి. అలా కాకపోతే అనుకరణకు అలవాటు పడుతుంటారు. సోషల్ మీడియాలో ప్రతిదీ ఎంతో సులువుగా చూపిస్తుంటారు. అందులో వాస్తవికతను గ్రహించాలి.
కరోనా కాలం.. ఆందోళన తీవ్రం!
కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతూ వచ్చాం. ఏమవుతుందోననే ఆందోళన మానసికంగా ఆవహించింది. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఓ అధ్యయనంలో తేలింది. దాని ఆధారంగా అధిక రక్తపోటుతో బాధపడే వారిలో ఒత్తిడి ఎలా ఉంటుంది? దాన్ని ఎలా అధిగమించారు? సామాజికంగా వారికి ఏ విధంగా మద్దతు లభించిందనే అంశాల ఆధారంగా మానసిక సమస్యలపై హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రత్యేకంగా సర్వే చేశారు. వర్సిటీ హెల్త్ సైకాలజీ విభాగం ఆచార్యులు మీనాహరిహరన్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థిని ఒయెండ్రిల్లా ముఖర్జీ నేతృత్వంలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు వర్గాలకు చెందిన 400 మందిపై అధ్యయనం చేశారు. కరోనా ప్రభావంతో అధిక రక్తపోటుతో బాధపడే వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు గుర్తించారు.
వెలుగు చూసిన అంశాలు
* అధ్యయనంలో 80 శాతం మందిలో నిద్ర లేమి సమస్య ఉన్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటు కారణంగా తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, కాళ్లవాపు, గుండె దడ లక్షణాలు ఎక్కువైనప్పుడు నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల నిస్సహాయత, ఆందోళనకు గురై మానసిక అనారోగ్యం పాలయ్యారు.
* మిగిలిన వారిలో మాత్రం సమస్యను అధిగమించి మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా జాగ్రత్తపడ్డారు. వారికి కుటుంబం, స్నేహితుల నుంచి భరోసా లభించింది. సామాజికంగా దూరంగా ఉన్నా.. మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడంతో ఇబ్బందిని అధిగమించారు.
మద్దతు కీలకం:
మానసిక ఆరోగ్యం బలోపేతం కావాలంటే కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉండాలి. సామాజిక మద్దతు ఇవ్వాలి. దీని వల్ల జీవితంలో ఎంత ఒత్తిడి ఎదురైనా.. అధిగమించే వీలుంటుంది. భారతీయ సమాజం, సంస్కృతిలో అందర్నీ కలుపుకొని వెళ్లే విధానం ఉంది. అందువల్లే కరోనా ప్రబలిన తర్వాత చాలా మందికి సామాజిక మద్దతు లభించి మానసిక సమస్యలు అధిగమించగలిగాం.
ఇవీ చూడండి: