ఉలవచారు అప్పటికప్పుడే చేసుకుంటే రుచి రాదు. దీన్ని చేయడానికి ఉలవలను కనీసం ఏడెనిమిది గంటలపాటు నానబెట్టాలి. అలాగే కప్పు ఉలవలు నానబెట్టడానికి కనీసం ఎనిమిది కప్పుల నీళ్లు పోయాలి. ఈ నానబెట్టిన నీళ్లలోనే వాటిని ఉడికించాలి. కుక్కర్‌లో అయితే అయిదారు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. ఈ మరిగించిన ఉలవల నీటిని వడకట్టి ఆ నీళ్లతోనే ఉలవచారు చేసుకోవాలి.
నీటిలో కాస్తంత చింతపండు నానబెట్టాలి. దీన్ని చిదిమి పిప్పితీసి ఒకసారి వడకట్టి.. చారులో కలపాలి. వడకట్టి పక్కన పెట్టుకున్న ఉలవల నీటిలో మళ్లీ నీళ్లు కలపొద్దు. ముడి కారాన్ని వాడాలి. తాలింపులో కేవలం ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఉడకబెట్టిన ఉలవలను గుగ్గిళ్ల రూపంలో తీసుకోవచ్చు లేదా మెత్తగా చిదిమి చారులో కలిపేసుకోవచ్చు. ఇలా చేస్తే చారు చిక్కగా వస్తుంది. తాలింపులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కరివేపాకు వేయడం మరిచిపోవద్దు. ఉల్లిపాయలు రెండు విధాలుగా వేసుకోవచ్చు. పచ్చివి కలపొచ్చు లేదా తాలింపులో వేయించుకోవచ్చు. పసుపు, కారం తాలింపులో వేసుకోండి, రుచి మెరుగుపడటానికి చిన్న బెల్లం ముక్క జత చేయొచ్చు.
-శ్రీ దేవి, హోటల్ మేనేజ్మెంట్ నిపుణురాలు
ఇదీ చదవండి:ఆహా చింత రుచి.. తినరా మైమరచి!